Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....
New Delhi, August 6: భారతదేశంలో క్రీడాకారులకు అందించే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా పేరు మారుస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ ఇకపై ఖేల్ రత్న అవార్డు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా పిలవబడుతుంది, జై హింద్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
భారత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గౌరవార్థం 1991-92 లో ఈ పురస్కారం ప్రారంభింపబడింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. దేశంలో క్రీడాకారులకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నతమైన క్రీడా పురస్కారం ఇది. పురస్కారంలో భాగంగా ప్రశంసాపత్రం, మెడల్ మరియు నగదును క్రీడాకారుడికి అందజేస్తారు.
ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్‌వెల్త్ క్రీడల్లో గాని, బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్, చదరంగం వంటి క్రీడల్లో గానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వ్యక్తిగతంగా క్రీడాకారునికి లేక జట్టుకు ఈ పురస్కారం లభిస్తుంది. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పురస్కార విజేతను నిర్ణయించేందుకు క్రీడలతో సంబంధమున్న వారితో కూడిన ఒక ఎంపిక కమిటీని నియమిస్తుంది. సాధారంణంగా ఈ పురస్కారం ప్రకటించేందుకు కనీసం ఒక సంవత్సర కాలంగా క్రీడాకారుడి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటారు. ఏదైనా సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధంగా లేవని కమిటీ భావిస్తే ఆ ఏడాదికి పురస్కార ప్రదానం జరగదు.
Check PM Modi's Tweet:
ఇక, మేజర్ ధ్యాన్‌చంద్ 1928-36 కాలంలో ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. ఇప్పటివరకు దేశానికి ఒలంపిక్స్ క్రీడల్లో వరుసగా 3 సార్లు బంగారు పతకాన్ని సాధించటంలో ఆయన జట్టును నడిపించారు. ఆయన జయంతి అయిన ఆగష్టు 29ను జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఖేల్ రత్న అవార్డుకు కూడా ధ్యాన్‌చంద్ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.