Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు
మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
Vijayawada, June 10: రైతన్నలకు (Farmers) శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు (Sourthwest Monsoon) ఆంధ్రప్రదేశ్‌ను (Andhrapradesh) తాకనున్నాయి. ఇప్పటికే కేరళను (Kerala) తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను ఇవి తాకుతాయని పేర్కొంది. మరోవైపు, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
దివిసీమలో గాలివాన
కృష్ణా జిల్లా దివిసీమలో నిన్న సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై అడ్డంగా పడ్డాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
MS Dhoni As Footballer? పాఠ్య పుస్తకంలో పుట్‌బాల్ ఆటగాడిగా ఎంఎస్ ధోని, వైరల్ అవుతున్న పిక్ ఇదిగో..
తెలంగాణలో నిప్పులు
తెలంగాణలో భానుడు మండిపోతున్నాడు. జనంపై నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వీచిన వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పది మండలాల్లో 45-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.