Weather Forecast: జాడలేని అల్ప పీడనాలు, హిమాలయాల వద్ద తిష్ట వేసిన రుతుపవనాలు, వచ్చే నెలలో కూడా వర్షాలు కష్టమే, ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ

ఫలితంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టు తర్వాత సెప్టెంబరు వర్షపాతం తగ్గుముఖం పట్టిందని ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.

Monsoon (Representational Image; Photo Credit: Twitter)

India on track for lowest monsoon rains in eight years: జూలైలో భారీ వర్షపాతంతో హడలెత్తించిన రుతపవనాలు ఆగస్టులో నెమ్మదించాయి. ఫలితంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టు తర్వాత సెప్టెంబరు వర్షపాతం తగ్గుముఖం పట్టిందని ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. ఎల్‌నినో ఆగస్టులో వర్షపాతాన్ని తగ్గించింది సెప్టెంబర్ వర్షపాతంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది" అని భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.

భారత్.. జూన్-సెప్టెంబర్ రుతుపవనాల సీజన్‌ను కనీసం 8 శాతం వర్షపాతం లోటుతో ముగించే క్రమంలో ఉందని అధికారి తెలిపారు. వాతావరణ అధికారులు తమ సెప్టెంబర్ సూచనను ఆగస్టు 31న ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా వేసవి వర్షపాతం లోటు చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను మరింత ఖరీదైనదిగా చేస్తుంది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చు. ఇది జూలైలో జనవరి 2020 నుండి అత్యధిక స్థాయికి పెరిగింది.

ప్రజ్ఞాన్‌ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో

ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని, ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా అత్యధిక వర్షాపాతం నమోదైంది. జులైలో 489.9 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డు కాగా.. లోటు తీరినట్లయ్యింది.

సాధారణ సగటు కంటే జూన్‌లో తొమ్మిది శాతం తక్కువ లోటు ఉండగా.. జులైలో 13శాతం ఎక్కువగా నమోదైంది. మరో వైపు సెప్టెంబర్‌ 17 నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్లనున్నాయి. రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కారణంగా గత నాలుగేళ్లుగా సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదవుతున్నప్పటికీ.. తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. వార్షిక సగటు వర్షాపాతంలో 70శాతం రుతుపవనాల సమయంలోనే నమోదు అవుతుండడం గమనార్హం.

విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా సరే నో మొబైల్, ఏపీలోని అన్ని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి.ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్‌ ట్రఫ్‌) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది.

మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు.

అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్‌లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్‌ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే ఆశాజనకరమైన విషయం ఏంటంటే వచ్చే నెలలో రుతుపవన ద్రోణి ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దక్షిణాదిలో వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంది.