BRS Parliamentary Party Meeting:త్వరలోనే ప్రజల్లోకి వస్తా! ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదామంటూ ఎంపీలకు కేసీఆర్ పిలుపు
త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. సమావేశం అనంతరం రాజ్యసభలో బీఆర్‌ఎస్ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. విభజనచట్టంలోని హామీలపై పార్లమెంట్‌లో మాట్లాడుతామన్నారు. కృష్ణాబోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు.
Hyderabad, JAN 26: త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ (BRS Parliamentary Party Meeting) సమావేశం జరిగింది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. భేటీకి రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హాజరయ్యారు.
సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్‌ఎస్ ఎంపీలపైనే ఉందన్నారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పని చేసేది బీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ గళం బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్, పోట్రోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారన్నారు.
బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. సమావేశం అనంతరం రాజ్యసభలో బీఆర్‌ఎస్ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. విభజనచట్టంలోని హామీలపై పార్లమెంట్‌లో మాట్లాడుతామన్నారు. కృష్ణాబోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. తెలంగాణ గళం, బలం, దళం బీఆర్‌ఎస్సేనని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు.