Parliament Winter Session: ఈ సమావేశాలు ముగిసేవరకు 12 మంది రాజ్యసభ ఎంపీలు సస్పెండ్, గత సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసిన స్పీకర్
గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
New Delhi, Nov 29: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలు రాజ్యసభలో సస్పెండ్ కు గురయ్యారు. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్ (12 Opposition Members Suspended) కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
సస్పెండ్ అయిన 12మంది సభ్యుల్లో.. ఫూలోదేవి నేతం (కాంగ్రెస్), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్ బోరా (కాంగ్రెస్), రాజామణి పటేల్ (కాంగ్రెస్), అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్), డోలా సేన్ (తృణమూల్), శాంతా ఛత్రీ (తృణమూల్), ప్రియాంకా చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ (శివసేన), బినోయ్ విశ్వం (సీపీఐ), కరీం (సీపీఎం) ఉన్నారు.
మరోవైపు, రాజ్యసభలో తొలిరోజే విపక్షాల ఆందోళనల పర్వం కొనసాగింది. సాగుచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను కొనసాగించడం కష్టమని భావించిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) భాగంగా ఉదయం సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆబిట్వరీ రిఫరెన్సెస్ చదివి వినిపించారు. ఇటీవల మరణించిన సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్‌తోపాటు మరో ఐదుగురు మాజీ ఎంపీలకు సభ నివాళులర్పించింది. అనంతరం సభ్యులంతా లేచి నిలబడి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
ఆ తర్వాత ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి గౌరవ సూచకంగా రాజ్యసభను ఒక గంటపాటు వాయిదా వేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, వ్యవసాయవేత్త అయిన ఆస్కార్ ఫెర్నాండెజ్ (88) గత సెప్టెంబర్ 13న కన్నుమూశారు. ఆయన మొత్తం నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణం ద్వారా దేశం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని, ప్రేమించదగిన వ్యక్తిని, అంకితభావంగల సామాజిక కార్యకర్తను, మంచి పరిపాలకుడిని, గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని వెంకయ్యనాయుడు సభలో చదివి వినిపించారు.