Cryptocurrency

New Delhi, November 29: క్రిప్టోకరెన్సీపై రకరకాల ఊహాగానాల నడుమ బిట్‌కాయిన్‌ భవితవ్యంపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని (No Proposal to Recognise It as Currency) ఆమె స్పష్టం చేశారు. లోక్‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానం (Centre Informs Lok Sabha) ఇచ్చిన మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. బిట్‌కాయిన్ లావాదేవీల‌కు చెందిన డేటాను ప్ర‌భుత్వం సేక‌రించ‌డంలేద‌న్నారు.

అయితే ఈ శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో క్రిప్టో బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ది. బిట్‌కాయిన్ లావాదేవీల నియంత్ర‌ణ కోసం రెగ్యులేట‌రీ వ్య‌వ‌స్థ అవ‌స‌రం అన్న అభిప్రాయాన్ని ఇటీవ‌ల కేంద్రం వ్య‌క్తం చేసింది. అయితే బ్యాంక్ నోటు అన్న నిర్వ‌చ‌నాన్ని మారుస్తూ, దాంట్లో డిజిట‌ల్ క‌రెన్సీని కూడా జోడించే విధంగా ఆర్బీఐ చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌ని ఇటీవ‌ల కేంద్రాన్ని ఆర్బీఐ కోరిన విష‌యం తెలిసిందే.

సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం, చర్చ నిర్వ‌హించ‌కుండానే మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు చేశారని విప‌క్షాలు ఆందోళన

బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ ప్రభుత్వం చేయట్లేదని, అలాగే బిట్‌కాయిన్‌ ట్రాన్‌జాక్షన్స్‌కు సంబంధించి వివరాలు సేకరించామన్న సమాచారం నిజం కాదని (Govt Does Not Collect Data on Bitcoin) ఆమె స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న బిట్‌కాయిన్‌ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైంది. అంతేకాదు క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది.

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, తెలంగాణలో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్, రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

ఇక 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్‌కాయిన్‌.. డిజిటల్‌ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్‌కాయిన్‌తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్‌ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది. నిర్మలా సీతారామన్‌ తాజా ప్రకటనతో బిట్‌కాయిన్‌ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది.