Maharashtra Hospital Fire: ఐసీయూలో పేలిన ఏసి, అగ్నిప్రమాదంలో 13 మంది కోవిడ్ రోగులు మృతి, నాసిక్ ఘటన మరవక ముందే మహారాష్ట్రలో మరొక ఘోర అగ్ని ప్రమాదం
ఈ దురదృష్టకర సంఘటనలో కనీసం 13 మంది కరోనా రోగులు మరణించినట్లు సమాచారం....
Virar, April 23: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విరార్ ప్రాంతంలోని కోవిడ్ ఆసుపత్రికి చెందిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటనలో కనీసం 13 మంది కరోనా రోగులు మరణించినట్లు సమాచారం.
జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, కోవిడ్ పేషెంట్ల కోసం కేటాయించబడిన విజయ్ వల్లభ్ ఆసుపత్రి యొక్క రెండవ అంతస్థులో శుక్రవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూలోని ఏసి పేలటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ యూనిట్లో మొత్తం 16 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అందులో 13 మంది చనిపోయారు. ఆసుపత్రిలోని మిగతా రోగులను వేరే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయం ఆలస్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే వాసై విరార్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి 3 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకొని ఉదయం 5:20 సమయానికి మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
మహారాష్ట్రలోని నాసిక్‌లో గల డాక్టర్ జాకీర్ హుస్సేన్ హాస్పిటల్ వెలుపల ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో 24 కోవిడ్ -19 రోగులు ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజుల్లోనే ఈ విషాద సంఘటన జరిగటం కలచివేస్తుంది.
దేశంలో ఒకవైపు మహమ్మారి సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక, ఔషధాల కొరతతో ప్రాణాలు విడుస్తున్నారు. మరోవైపు నిస్సహాయ స్థితిలో ఇలాంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకోవడం దేశంలో దయనీయ పరిస్థితులకు అద్ధంపడుతోంది.