Dead Girl Found Alive After 7 Years: కొడుకుకు శిక్ష తప్పించేందుకు తల్లి ఏడేళ్ల పోరాటం, చనిపోయిన బాలికను తిరిగి తీసుకొచ్చిన వైనం, ఉత్తరప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన
కిడ్నాప్ కేసు విచారణ సాగుతుండగానే.. బాలిక తల్లిదండ్రులకు ఒక విషయం తెలిసింది. తన కూతురు పోలికలున్న ఒక అమ్మాయి ఆగ్రా ప్రాంతంలో హత్యకు గురైనట్లు తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు బాలిక మృతదేహాన్ని చూసి, అది తమ కూతురే అని చెప్పారు.
Aligarh, DEC 09: ఉత్తర ప్రదేశ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ఏడేళ్లక్రితం హత్యకు గురైందనుకున్న అమ్మాయి తిరిగొచ్చింది. నిందితుడి తల్లి చేసిన ప్రయత్నం ఫలించింది. అలీఘడ్ (Aligarh) ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల వయసున్న ఒక బాలిక 2015లో కనిపించకుండా పోయింది. అప్పుడు బాలిక తల్లిదండ్రులు విష్ణు అనే యువకుడిని అనుమానించారు. బలవంతంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే విష్ణు తన కూతురును ఎత్తుకెళ్లాడని భావించారు. దీనిపై స్థానిక గోండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విష్ణును అరెస్టు చేశారు. అప్పుడు అతడి వయసు 18 ఏళ్లు. కిడ్నాప్ కేసు విచారణ సాగుతుండగానే.. బాలిక తల్లిదండ్రులకు ఒక విషయం తెలిసింది. తన కూతురు పోలికలున్న ఒక అమ్మాయి ఆగ్రా ప్రాంతంలో హత్యకు గురైనట్లు తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు బాలిక మృతదేహాన్ని చూసి, అది తమ కూతురే అని చెప్పారు. దీంతో పోలీసులు పోస్టుమార్టమ్ నిర్వహించి, మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వాళ్లు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తర్వాత ఇది హత్య కేసుగా మారింది.
అయితే, తన కొడుకు కిడ్నాప్, హత్య చేసి ఉండడు అని నిందితుడు విష్ణు తల్లి నమ్మింది. ఆ బాలిక ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని భావించింది. తన కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది. తన కొడుకు నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ఉన్న ఏకైక ఆధారం.. కనిపించకుండా పోయిన బాలికను పట్టుకోవడం. దీంతో అప్పటి నుంచి ఆ బాలిక కోసం విష్ణు తల్లి ప్రయత్నిస్తూనే ఉంది. బాలిక కోసం గాలిస్తూనే ఉంది. ఇటీవల ఏడు సంవత్సరాల తర్వాత ఆ బాలికను విష్ణు తల్లి కనుక్కుంది. బాలిక వయసు ప్రస్తుతం 22 సంవత్సరాలు.
హత్రాస్ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరైన బాలికను ఆమె గుర్తించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పింది. వాళ్లు బాలికను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. ఏడు సంవత్సరాల క్రితం చనిపోయింది అనుకున్న బాలిక తిరిగొచ్చింది. ప్రస్తుతం పోలీసులు బాలికకు, ఆమె తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్టు (DNA Test) నిర్వహించబోతున్నారు. ఈ ఫలితాన్ని బట్టి నిందితుడి విడుదల ఆధారపడి ఉంటుంది. నిందితుడు నిర్దోషిగా విడుదలైతే, తన కొడుకు అమాయకత్వాన్ని నిరూపించేందుకు ఏడేళ్లుగా ఒక తల్లి చేసిన ప్రయత్నం ఫలించినట్లవుతుంది.