1971 Indo-Pak War: విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ ఘాజీ శకలాలను గుర్తించిన డిఎస్‌ఆర్‌వి, 1971 యుద్ధ సమయంలో దాన్ని కూల్చేసిన INS రాజ్‌పుత్
టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది.
PNS Ghazi Found Near Vizag Coast: భారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఇండియన్ నేవీ డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV) భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 4న మునిగిపోయిన పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇటీవలే గుర్తించింది . టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది. ఇది తీరానికి 2 నుండి 2.5 కి.మీ దూరంలో 100 మీటర్ల లోతులో శకలాలను కనుగొనబడింది.అయితే, నిజమైన నేవీ సంప్రదాయంలో.. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం కావడంతో వాటిని తాకలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి విశాఖపట్టణం వరకు చొచ్చుకొచ్చి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించిన పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ చావుదెబ్బ తిన్న సంగతి విదితమే. 1972లో బంగ్లాదేశ్ ఆవిర్భావంతో ముగిసిన యుద్ధంలో 93 మందితో (11 మంది అధికారులు, 82 మంది నావికులు) విశాఖ తీరంలో ఉన్న PNS ఘాజీ మునిగిపోవడం ఒక ఉన్నత ఘట్టంగా పరిగణించబడింది.
ఘాజీ నవంబర్ 14, 1971న కరాచీ నుండి బయలుదేరి వైజాగ్ తీరానికి చేరుకోవడానికి భారత ద్వీపకల్పం చుట్టూ నిశ్శబ్దంగా 4,800 కి.మీ.ప్రయాణం చేసింది.ప్రమాదవశాత్తూ జరిగిన పేలుళ్లే తమ మెరైన్ మునిగిపోవడానికి కారణమని పాకిస్థాన్ సైన్యం ఇప్పటికీ చెబుతూ వస్తోంది. అయితే వాస్తవం ఏంటంటే..భారతదేశం తన డిస్ట్రాయర్, INS రాజ్‌పుత్‌ను దాని మీదకు పంపింది. ఇది ఘాజీని ట్రాక్ చేసి దాన్ని సముద్రం లోనే ఏరి పారేసింది.
వైజాగ్ సమీపంలో బంగాళాఖాతంలో నేలపై ఉన్న జలాంతర్గామి PNS ఘాజీ మాత్రమే కాదు.ఇంపీరియల్ జపనీస్ నేవీ (RO-110)కి చెందిన ఒక జపనీస్ జలాంతర్గామి రెండవ ప్రపంచ యుద్ధం (ఫిబ్రవరి 12, 1944) సమయంలో వైజాగ్ జిల్లాలో రాంబిల్లి ప్రాంతం తీరంలో మునిగిపోయింది. డెప్త్ ఛార్జీలను ఉపయోగించి జలాంతర్గామిని HMAS లాన్సెస్టన్ మరియు HMIS జుమ్నా మునిగిపోయాయి.
వైజాగ్ తీరానికి సమీపంలో సముద్రం దిగువన రెండు జలాంతర్గాములు పడి ఉన్నాయని అనుభవజ్ఞుడైన నౌకాదళ సిబ్బంది తెలిపారు. 2013లో ఐఎన్ఎస్ సింధ్‌రక్షక్ ప్రమాదానికి గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్ఆర్‌వీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
నౌకలు, జలాంతర్గాములు ప్రమాదానికి గురైనప్పుడు వాటిని గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రస్తుతం నేవీ వద్ద రెండు డీఎస్ఆర్‌వీలు అందుబాటులో ఉన్నాయి. నౌకలు, విమానాల ద్వారా దీనిని తరలించవచ్చు. 40 కంటే ఎక్కువ దేశాలు జలాంతర్గాములను నిర్వహిస్తుండగా.. భారత్ సహా 12 దేశాల వద్ద మాత్రమే ప్రస్తుతానికి ఇలాంటి సాంకేతికత అందుబాటులో ఉంది. డీఆర్ఎస్‌వీ 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది.