Pune Murder: మటన్ సూప్‌లో అన్నం మెతుకులు వచ్చాయని వెయిటర్ ను హత్యచేసిన యువకులు, పుణెలో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన, అడ్డం వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులపై కూడా విచక్షణారహితంగా దాడి
మటన్ సూప్ (Mutton Soup) బాగోలేదనే కారణంతో ఓ హోటల్‌లో పని చేస్తున్న వ్యక్తిని కొట్టి చంపారు ఇద్దరు వ్యక్తులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు దుండగులు...అడ్డొచ్చని హోటల్ సిబ్బందిపై కూడా దాడి చేశారు.
Pune, NOV 17: మహారాష్ట్రలోని పుణెలో (Pune) దారుణం జరిగింది. మటన్ సూప్ (Mutton Soup) బాగోలేదనే కారణంతో ఓ హోటల్‌లో పని చేస్తున్న వ్యక్తిని కొట్టి చంపారు ఇద్దరు వ్యక్తులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు దుండగులు...అడ్డొచ్చని హోటల్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.... మహారాష్ట్రలోని పుణెలో (Pune) మంగళవారం రాత్రి ఒక రెస్టారెంట్లో వెయిటర్ ను (Waiter Killed) ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. ఆ ఘర్షణలో మరో ఇద్దరు రెస్టారెంటు ఉద్యోగులు గాయపడ్డారు. మంగళవారం రాత్రి పుణెలోని పింపుల్ సౌదాగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ కు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారు. మటన్ సూప్ ఆర్డర్ ఇచ్చారు. ఆ సూప్ లో వారికి అన్నం మెతుకులు (rice in mutton soup) కనిపించాయి. దాంతో పట్టరాని కోపంతో వారు 19 ఏళ్ల వెయిటర్ మంగేశ్ పోస్టే పై చేయి చేసుకున్నారు. తలపై తీవ్రంగా కొట్టడంతో అతడు కింద పడిపోయి స్పృహ తప్పి పడిపోయాడు.
మంగేశ్ పై దాడిని అడ్డుకోబోయిన మరో ఇద్దరు రెస్టారెంట్ ఉద్యోగుల పైనా వారు దాడి చేసి గాయపర్చారు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి, మంగేశ్ ను ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనంతరం నిందితులైన ఆ ఇద్దరిపై ఐపీసీ 302 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని విజయ్ వాఘరేగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.