Covid in India: మూడు రాష్ట్రాలకు పాకిన కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1, దేశంలో 20 కొవిడ్ జేఎన్.1 వేరియంట్ కేసులు, గోవాలోనే 18 కేసులు
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.
New Delhi, Dec 20: మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి (Covid in India) మళ్లీ పంజా విప్పుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేఎన్.1 కేసులు (Covid sub-variant JN.1) దేశంలో మూడు రాష్ట్రాల్లో 20 నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
ఇందులో గోవాలోనే 18 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. ఒకటి కేరళ, మరొకటి మహారాష్ట్రలో ఒక్కో కేసు నమోదైనట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఇన్సాకాగ్ (INSACOG)ను కేంద్రం వైరస్ జన్యువ్రేణి, వైరస్ వైవిధ్యంపై అధ్యయనం చేయడంతో పాటు పర్యవేక్షించడానికి కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2020లో ఏర్పాటు చేసింది.
సబ్ వేరియంట్‌ను దేశంలో గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సన్నద్ధతపై ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న కొవిడ్ వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల
మరో వైపు దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.