Heart Attack Death: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు, ఆస్పత్రికి తరలించేలోపే మృతి, ఆగని ఆకస్మిక గుండెపోటు మరణాలు
తోటి మిత్రులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు తెలిపారన్నాడు.
Bhopal, DEC 31: ఇటీవల కాలంలో గుండెపోటుతో (Heart Attack) మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉంటూ అందరిలో చలాకీగా తిరుగుతూ కనిపిస్తున్న వారు ఉన్నపళంగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుకు (Heart Attack) గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో యువకులు ఉండడం తీవ్రంగా కలచివేస్తోంది. తాజాగా క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖర్గోన్ జిల్లా బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో ఇందల్ సింగ్ జాదవ్ బంజారా అనే 22 యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం అతడు తన మిత్రులతో కలిసి క్రికెట్ ఆడాడు. బౌలింగ్ చేసే సమయంలో అతడు అసౌకర్యానికి గురైనట్లు గ్రామస్థుడు శాలిగ్రామ్ గుర్జర్ చెప్పాడు. దీంతో అతడు చెట్టు కింద కూర్చున్నాడని వెల్లడించాడు.
అతడి జట్టు విజయం సాధించిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తుందని (Heart Attack While Playing Cricket) చెప్పాడని, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడన్నారు. తోటి మిత్రులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు తెలిపారన్నాడు. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారని, పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.