Farmers’ Protest: ఢిల్లీ సరిహద్దులు అష్టదిగ్భందనం, రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా భద్రతా దళాలు మోహరింపు, బార్డర్స్ లో ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలు
ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, బ్యానర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, జనాలను ఎక్కించుకొని ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు.
New Delhi, FEB 13: కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు నిర్వహించ తలబెట్టిన ‘ఢిల్లీ చలో’ (Delhi Chalo) మార్చ్‌తో రాజధాని హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను (Farmers Protest) దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఏకంగా నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, బ్యానర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, జనాలను ఎక్కించుకొని ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు.
అలాగే ఇటుకలు, రాళ్లు, యాసిడ్ వంటి ప్రమాదకరమైన ద్రవ పదార్థాలు, పెట్రోల్, సోడా నీళ్ల బాటిళ్లు వంటి వాటిని వెంట తీసుకురావడంతోపాటు లౌడ్‌స్పీకర్ల వినియోగంపైనా నిషేధించారు. రైతుల ఆందోళన దృష్ట్యా ఢిల్లీ, చండీగఢ్‌లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా (Farmers’ March) అడ్డుకొనేందుకు సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల (Delhi Borders) ప్రవేశ పాయింట్ల వద్ద సిమెంట్ బారికేడ్లు, ఇనుప కంచెలు, మేకులు, కంటెయినర్లతో బహుళ అంచెల బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు పరిస్థితిని సమీక్షించేందుకు సింఘూ సరిహద్దు వద్ద ఒక తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.
హర్యానాతో సరిహద్దులు పంచుకొనే గ్రామీణ రహదారులను మూసివేశారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. పంజాబ్ సరిహద్దుల్లోని అంబాలా, జింద్, ఫతేబాద్, కురుక్షేత్ర, సిర్సా జిల్లాల్లో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది.
200కు పైగా రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌లో పాల్గొంటాయని రైతు నేతలు ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చాలో భాగంగా ఉన్న బీకేయూ(దోబా) ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ‘ఢిల్లీ చలో’ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే పంజాబ్, హర్యానా పలు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో బయలులేరారు.
డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ర్యాలీగా ఢిల్లీ చేరుకొని.. అనంతరం పార్లమెంట్ భవనం వెలుపల ఆందోళన చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం) ప్రకటించాయి.