JMI Standoff: దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం సెగలు, జామియా వర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం, వర్శిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై పోలీసుల దాడి, అరెస్ట్‌కు నిరసనగా విద్యార్థుల ఆందోళనలతో 50 మంది విద్యార్థులను విడుదల చేసిన పోలీసులు
నిరసనల్లో పాల్గొనని వారిపై కూడా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల చర్యను యూనివర్శిటీ వీసీ నజ్మా అఖ్తర్ ఖండించారు.
New Delhi, December 16: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (Jamia Millia Islamia University ) లో ఆదివారం చెలరేగిన ఘర్షణల సందర్భంగా అదుపులోకి తీసుకున్న 50 మంది విద్యార్థులను దిల్లీ పోలీసులు సోమవారం ఉదయం విడుదల చేశారు. 50 మంది విద్యార్థులలో 35 మందిని కల్కాజీ పోలీస్ స్టేషన్ నుండి, 15 మందిని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేసినట్లు దిల్లీ సీపీ ఆర్పీ ఎంఎస్ రన్ధావా (MS Randhawa) విలేకరులతో అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాని (CAA)కి వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆదివారం చేపట్టిన నిరసనలు (JMI Protests) హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో నాలుగు ప్రభుత్వ బస్సులు మరియు రెండు పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు.
పరిస్థితులు అదుపుతప్పటంతో , వర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించిన దిల్లీ పోలీసులు, విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌గాస్ షెల్స్‌ను ఉపయోగించారు. ఈ ఘర్షణలో విద్యార్థులు అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులతో సహ సుమారు 60 మందికి గాయాలయ్యాయి.
అయితే అనుమతి లేకుండానే పోలీసులు వర్శిటీలోకి ప్రవేశించి 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారని, నిరసనల్లో పాల్గొనని వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారని పోలీసులపై విద్యార్థులు మరియు రాజకీయ, ప్రజాసంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను యూనివర్శిటీ వీసీ నజ్మా అఖ్తర్ ఖండించారు.
వర్శిటీలో పోలీసు చర్యలకు నిరసనగా దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట పెద్దఎత్తున విద్యార్థులు, రాజకీయ నాయకులు మరియు మానవ హక్కుల కార్యకర్తలు రాత్రంతా ఆందోళనకు దిగడంతో నిర్భంధించిన విద్యార్థులను పోలీసులు సోమవారం ఉదయం విడుదల చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దిల్లీ మెట్రో సర్వీసులు ఆదివారం నిలిపివేశారు. భద్రతా కారణల దృష్ట్యా 15 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. అయితే తిరిగి సోమవారం యధావిధిగా సర్వీసులను పున: ప్రారంభిస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది.