
Hyderabad, Mar 4: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) గుడ్ న్యూస్ చెప్పింది. ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు (Telangana Inter Exams) ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన పెట్టినా.. 9:05 గంటల వరకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు తెలిపారు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే ఉదయం 8:45 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్ టికెట్లపై ముద్రించిన మాట నిజమేనని, విద్యార్థులు త్వరగా పరీక్షాకేంద్రాలకు వస్తే టెన్షన్ కు గురవకుండా పరీక్షరాస్తారన్న ఆలోచనతోనే అలా ప్రింట్ చేయించామని తెలిపారు. బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9.05 గంటలకు వచ్చినా విద్యార్థులను లోనికి అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి 9 గంటల వరకు ఓఎంఆర్ పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
లీకైతే పట్టేసుకోవచ్చు
ఈసారి హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించడంతో దానిని స్కాన్ చేయడం ద్వారా పరీక్ష కేంద్రాన్ని విద్యార్థులు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే, ప్రశ్నపత్రంపై సీరియల్ నంబర్ ముద్రించారు. దీంతో ప్రశ్నాపత్రం లీకులను ఈజీగా పట్టేయవచ్చు. ఏ పేపర్ ఏ విద్యార్థికి వెళ్తుందో ఈ సీరియల్ నంబర్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల పేపర్ లీకైనా ఏ పరీక్ష కేంద్రం నుంచి, ఏ విద్యార్థి ద్వారా బయటకు వచ్చిందన్న వివరాలు తెలిసిపోయాయి.
టెన్షన్ గా ఉంటే..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలుపుకొని మొత్తం 4,97,528 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తుండగా 4,99,443 అమ్మాయిలు పరీక్ష రాయబోతున్నారు. పరీక్షకు ముందు మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు గురైతే టోల్ ఫ్రీ నంబర్ 14416కు కానీ, బోర్డు కార్యాలయంలోని హెల్ప్ లైన్ నంబర్ 92402 05555కు కానీ ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.