
Vijayawada, Mar 8: ఏపీలో పదో తరగతి పరీక్షలు (SSC Exams) రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) శుభవార్త చెప్పింది. ఎస్సెస్సీ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించింది. అయితే, విద్యార్థులు పరీక్షా హాల్ టికెట్ చూపిస్తేనే ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరించింది.
17 నుంచి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6.49 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు పథకం మహిళలకు రాష్ట్రమంతటా అందుబాటులో ఉండదని తేల్చిచెప్పారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.