
Hyderabad, March 07: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్ని అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో (Warangal) లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ సమీపంలోని విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం నాడు జరిగే కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని.. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి గోసపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్‌ఎస్ పార్టీకే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.
‘బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ప్రజలు బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీగా తమ సొంతింటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. వారి రక్షణ బీఆర్‌ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు.’ అని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపం తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగసభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని, అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.
వరంగల్ బహిరంగ సభ అనంతరం.. బీఆర్‌ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి , ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిగింది.
గత ఒడిదొడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా, తెలంగాణ సమాజానికి మొదటి నుంచీ అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సమావేశం భావించింది. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థం చేయించి పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు ప్రాతినిథ్యం ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
కాగా పలు అంశాలపై చర్చ సందర్భంగా అధినేత అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.