5G Spectrum Auction: జోరుగా 5జీ వేలం, నాలుగో రోజు వేలంలో రూ.1,49,855 కోట్లు, ఇప్పటి వరకు వేలంలో ఎంత వచ్చిందో తెలుసా? 71 శాతం స్పెక్ట్రమ్ వేలం పూర్తయినట్లు ప్రకటన, శనివారం కూడా కొనసాగనున్న ఆక్షన్
ఈ నాలుగు రోజుల్లో వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లు అందాయని అన్నారు. శుక్రవారం మొత్తం ఏడు రౌండ్లలో బిడ్డింగ్ జరిగిందని అన్నారు. జూలై 26న వేలం ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు నాలుగు రౌండ్లు జరిగాయి.
New Delhi, July 29: భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం (5G auction) శుక్రవారం నాల్గవ రోజు కొనసాగింది. ఇప్పటి వరకు మొత్తం 23 రౌండ్ల బిడ్డింగ్ (Bidding) నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. నాల్గవ రోజువేలం ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లు అందాయని అన్నారు. శుక్రవారం మొత్తం ఏడు రౌండ్లలో బిడ్డింగ్ జరిగిందని అన్నారు. జూలై 26న వేలం ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు నాలుగు రౌండ్లు జరిగాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో వరుసగా ఐదు, ఏడు రౌండ్లలో బిడ్లు (Bids) జరిగాయి. మూడవ రోజు ముగిసే సమయానికి ప్రభుత్వం 16 రౌండ్లలో మొత్తం ₹1,49,623 కోట్ల విలువైన బిడ్‌లను అందుకుంది. మొదటి రోజు బిడ్‌ల మొత్తం విలువ ₹1.45 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. మరుసటి రోజు సంచిత విలువ ₹1,49,454 కోట్లకు పెరిగింది. ప్రారంభంలో వేలం నాలుగు రోజులు పాటు జరగాల్సి ఉంది. అయితే దానిని ఐదు రోజుల వరకు (శనివారం) పొడిగించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇదిలాఉంటే ఈ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Jio), గౌతమ్ అదానీకి (Adani) చెందిన అదానీ గ్రూప్, సునీల్ మిట్టల్ యొక్క భారతీ ఎయిర్‌టెల్ (Bharathi Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) వంటి నాలుగు అతిపెద్ద సంస్థలు పాల్గొన్నాయి. ఈ నాలుగు బడా కంపెనీలు ₹21,800 కోట్ల విలువైన డబ్బు డిపాజిట్ (EMD) ని చేశాయి. ఈ సందర్భంలో EMD మొత్తం Reliance Jioకి అత్యధికం (₹14,000 కోట్లు), అదానీ గ్రూప్‌కి (₹100 కోట్లు) తక్కువగా ఉంది. భారతి ఎయిర్‌టెల్ ₹5,500 కోట్లను EMDగా డిపాజిట్ చేసింది. వొడాఫోన్ మరియు ఐడియా యొక్క సంబంధిత సంఖ్య ₹2,200 కోట్లుగా ఉంది.
5G టెలికాం స్పెక్ట్రమ్ వేలం జూన్ లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం ఆమోదం పొందింది. 72 గిగాహెర్ట్జ్ (GHz) విలువైన స్పెక్ట్రమ్ ₹4.3 ట్రిలియన్ విలువైన 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో వేలం ప్రక్రియను కేంద్ర టెలికాం శాఖ నిర్వహిస్తోంది. వివిధ తక్కువ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz) మరియు అధిక (26 GHz) ఫ్రీక్వెన్సీలో స్పెక్ట్రమ్ కోసం వేలం నిర్వహించబడుతోంది.