Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ కమెంగ్ సెక్టార్‌లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి, భారత సైన్యం ధ్రువీకరణ
కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భారత ఆర్మీ (Indian Army) ప్రకటనలో వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్, ఫిబ్రవరి 9: అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి చెందినట్టు భారత సైన్యం మంగళవారం ధ్రువీకరించింది. కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భారత ఆర్మీ (Indian Army) ప్రకటనలో వెల్లడించింది. ఎత్తైన ప్రాంతమైన కమెంగ్ సెక్టార్‌లో ఆదివారం సైనికులు పెట్రోలింగ్ నిర్వర్తిస్తున్న సమయంలో భారీగా హిమపాతం సంభవించిందని దీంతో సైనికులు అక్కడే చిక్కుకుపోయారని తెలిపింది. మరణించిన ఏడుగురు సిబ్బంది 19 జమ్మూకశ్మీర్ రైఫిల్స్ పదాతిదళ రెజిమెంట్‌కు చెందిన వారు. వారు యాంగ్జీ సమీపంలోని చుమే గ్యటర్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు హిమపాతం సంభవించింది. మరణించిన వీరసైనికులు జుగల్ కిషోర్, అరుణ్ కట్టాల్, అక్షయ్ పఠానియా, విశాల్ శర్మ, రాకేష్ సింగ్, అంకేష్ భరద్వాజ్, గుర్బాజ్ సింగ్ ఉన్నారు. వారి అత్యున్నత త్యాగానికి నివాళులు అర్పిస్తున్నట్లు ఈస్టర్న్ కమాండ్, ఇండియన్ ఆర్మీ ప్రకటించాయి.