Punjab Lottery Winner: 88 ఏళ్ల వృద్ధుడికి జాక్ పాట్, రూ. 5 కోట్ల లాటరీ కొట్టిన పంజాబ్ వాసి, డేరాకు కూడా సమాన వాటా ఇస్తానంటున్న లాటరీ విన్నర్
ఈ సంక్రాంతి బంపర్ లాటరీలో అతనికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.5కోట్లు గెలుచుకున్నాడు. గెలుచుకున్న మొత్తంలో కటింగ్స్ పోను రూ.3.5 కోట్లు ద్వారకా దాస్ కు అందించనున్నట్లు లాటరీ నిర్వాహకులు లోకేశ్ తెలిపారు.
Ludhiana, JAN 20: పంజాబ్ లో (Punjab) ఓ వృద్ధుడికి జాక్ పాట్ తగిలింది. ఓ లాటరీ 88 ఏళ్ల వృద్ధుడి జీవితాన్నే మార్చేసింది. అతన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. పంజాబ్ లోని దేరబస్సికి (Derabassi) చెందిన మహంత్ ద్వారకా దాస్ (Mahant Dwarka Dass) అనే 88 ఏళ్ల వృద్ధుడికి.. లాటరీలంటే మహా ఇష్టం. తరచూ లాటరీ (lottery) టికెట్లు కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండేవాడు. ఈ క్రమంలో లోహ్రీ సందర్భంగా కొన్ని రోజుల క్రితం విక్రయించిన లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ సంక్రాంతి బంపర్ లాటరీలో అతనికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.5కోట్లు గెలుచుకున్నాడు. గెలుచుకున్న మొత్తంలో కటింగ్స్ పోను రూ.3.5 కోట్లు ద్వారకా దాస్ కు అందించనున్నట్లు లాటరీ నిర్వాహకులు లోకేశ్ తెలిపారు.
లాటరీలో రూ.5కోట్లు గెలుపొందడం పట్ల మహంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొంటున్నా. గెలిచిన మొత్తాన్ని నా ఇద్దరు కుమారులతోపాటు ‘డేరా’కు సమానంగా పంచుతా’ అని మహంత్ తెలిపారు. మహంత్ ద్వారకా దాస్ 13 ఏళ్ల వస్సులో 1947లో తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చాడు. అప్పటి నుంచి పంజాబ్‌లోనే స్థిరపడ్డాడు.