Adenovirus Scare in Bengal: బెంగాల్‌ను వణికిస్తున్న అడినోవైరస్ మహమ్మారి, గత 24 గంటల్లో ఏడు మంది చిన్నారులు మృతి, ఆస్పత్రుల్లో చేరిన వందలాది మంది పిల్లలు
వైరస్ కారణంగా రెండేండ్ల లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో అడోనోవైరస్ (Adenovirus) కారణంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఆస్పత్రి పాలయ్యారు.
Kolkata, Mar 2: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని గత కొద్ది రోజుల నుంచి అడోనోవైరస్ వణికిస్తోంది. వైరస్ కారణంగా రెండేండ్ల లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో అడోనోవైరస్ (Adenovirus) కారణంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఆస్పత్రి పాలయ్యారు. గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ (Adenovirus) మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏడుగురు చిన్నారుల్లో కోల్‌కతాలోని (Kolkata) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో (Bankura Sammilani Medical College and Hospital) ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్‌ఐ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 పడకలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో అడెనో వైరస్ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర హెల్ప్‌లైన్ 1800-313444-222 నెంబర్లను ప్రకటించారు.
అడెనోవైరస్ (Adenovirus) సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.బలహీనమైన రోగనిరోధక శక్తి, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులు అడెనోవైరస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందన్నారు. రోగులు దగ్గడం, తుమ్మడం, తాకడం వల్ల, మలమూత్రాల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.అడెనోవైరస్ (Adenovirus) సోకిన వారికి నిర్దిష్ట చికిత్సా విధానం లేదని, ఆమోదించిన యాంటీవైరల్ మందులు కూడా లేవని చెప్పారు. నొప్పి నివారణ మాత్రల ద్వారా తేలికపాటి లక్షణాలు తగ్గుతాయని అన్నారు.