Punjab Govt: సిద్దూ మూసేవాలా మరణంతో పంజాబ్ ప్రభుత్వం యూటర్న్, వీవీఐపీల భద్రతను పునరుద్దరిస్తూ నిర్ణయం, 400 మందికి పైగా వీవీఐపీలకు తిరిగి భద్రత ఏర్పాట్లు
ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు. పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.
Amritsar, June 02: వీవీఐపీలకు (VVIP) రాష్ట్రంలో సెక్యూరిటీ (Security) తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు (Punjab govt) తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు. పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ సోనికి భద్రత తొలగిస్తూ గత నెల 11న రాష్ట్రంలోని ఆప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఆయన హరియాణా-పంజాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాజ్ మోహన్ సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏ ప్రాతిపదికన భద్రత తొలగించాలనుకున్నారో తెలపాని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసు విచారణకు హాజరైన ప్రభుత్వం తాజాగా వీవీఐపీలకు భద్రత కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.
ఈ నెల 7 నుంచి సెక్యూరిటీ కల్పిస్తామని కోర్టుకు తెలిపింది. గత వారం రాష్ట్రంలోని 434 మంది వీవీఐపీలకు భద్రత తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మరునాడే సిద్ధూ హత్య జరిగింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లే సిద్ధూ హత్య జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో సర్కారు దిగొచ్చింది. వీఐపీలకు గతంలోలాగే భద్రత కల్పిస్తామని చెప్పింది.