Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, నెల్లూరును ముంచెత్తిన వానలు

ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Chandrababu Naidu Review (Photo/X/TDP)

Vjy, Oct 16: ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను నివేదించాలని సూచించారు. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారంతో ఐదుగురి మృతిపై సీఎం విచారం వ్యక్తం చేశారు.

మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో ఆలయ ధ్వంసం ఘటనను ఖండించారు. కదిరినాథునికోట అభయాంజనేయస్వామి ఆలయంపై దాడిపై విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరుకు 530 కి.మీ దూరంలో వాయుగుండం, ఏపీలో దంచికొడుతున్న వర్షాలు, తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

నిన్నటి (మంగళవారం) నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం.. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కొండాపురం మండలం, సత్యవోలు అగ్రారం మిడత వాగులో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తు్న్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో మంత్రి చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.

తుపాను ప్రభావం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. కలెక్టరే‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. ఆనం ఆదేశాలతో ముఖ్యంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఆర్డీవో పావని, అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.