Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.

YSRCP MLA Balineni Srinivasa Reddy (Photo-Twitter)

Vjy, Nov 29: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పార్టీ ఇచ్చారని.. ఆ పార్టీకి వెళ్లినవారికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు.

తన గన్ మెన్లను సరెండర్ చేసి, 'నాకు అది చేయలేదు ఇది చేయలేదు' అని చెప్పినా తనను వైసీపీ నుంచి తీసేయలేదని... తీసేసి ఉంటే వేరే పార్టీ తరపున పోటీ చేసి ఈరోజు మంత్రి అయ్యుండేవాడినని తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో మాట్లాడానని ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు.

చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు

జగన్ కేసులు, బెయిల్ గురించి బాలినేని మాట్లాడుతూ తప్పు చేసి ఉంటే శిక్ష కచ్చితంగా అనుభవిస్తారని బాలినేని చెప్పారు. ప్రజలకు జగన్ కొన్ని పథకాలు ఇచ్చారని, ఆ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారని అదే సమయంలో కార్యకర్తలను విస్మరించారన్నారు. వారిని పక్కన పెట్టేయడమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని తెలిపారు. అందుకే వైనాట్ 175, వైనాట్ కుప్పం నుంచి 11 సీట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ లో రియలైజేషన్ రాలేదని కార్యకర్తలను బాగా చూసుకుంటాననే ఒక్క మాట కూడా ఆయన నుంచి రాలేదని విమర్శించారు.

ప్రజలు తప్పు చేశారనే విధంగా జగన్ మాట్లాడుతున్నారని అయితే ప్రజలు ఎందుకు తప్పు చేస్తారని బాలినేని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేస్తే ప్రజలు కూడా తప్పు చేస్తారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో నాలుగు సార్లు, ఐదు సార్లు సీఎంగా ఉన్నవారు ఉన్నారని... వాళ్లెందుకు అన్ని సార్లు సీఎం అయ్యారని ప్రశ్నించారు. నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిపోతావని వ్యాఖ్యానించారు.

జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని... ఓటు ఎవరికి వేశారని సర్వేలు చేసేవారు అడిగినా ప్రజలు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీకి ఓటు వేయలేదని చెపితే తమను ఏం చేస్తారో అని భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు. అందరూ తనవల్లే గెలిచారని జగన్ చెప్పుకునేవారని... ఇప్పుడు అందరూ ఓడిపోయారని, వాళ్లంతా జగన్ వల్లే ఓడిపోయినట్టే కదా? అని బాలినేని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జగన్ ఒప్పుకోవాలి కదా? అని అన్నారు. ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ప్రజలు తప్పు చేశారని అంటున్నారని ఎద్దేవా చేశారు.



సంబంధిత వార్తలు