AP Coronavirus: దేశంలో కోవిడ్ కలవరం, 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో రేపు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ అత్యవసర సమావేశం, ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 7,244కి చేరుకున్న మరణాల సంఖ్య
గడచిన 24 గంటల్లో లక్షకు పైగా కొవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం వెల్లడించింది. గతేడాది కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Amaravati, April 5: కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉన్న 11 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యమంత్రులతో రేపు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ (Union Health Minister Harshavardhan) సమావేశం కానున్నారు. గడచిన 24 గంటల్లో లక్షకు పైగా కొవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం వెల్లడించింది. గతేడాది కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దీంతో ఒక్కరోజులో లక్షకు మించి కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, తర్వాత మూడోస్థానంలో భారత్ నిలిచింది. జనవరి 8న అమెరికాలో ఒకేరోజు 3 లక్షల కేసులు నమోదైనట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మార్చి 25న బ్రెజిల్‌లో 100,158 కొత్త కేసులు నమోదు కాగా.. 2,777 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అందించిన కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల సంఖ్య 7,91,05,163కి చేరినట్టు కేంద్రం తెలిపింది. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం 45 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ మొదలుపెట్టింది. తొలి విడతలో భాగంగా జనవరి 16న ఆరోగ్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బందికి కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మార్చి 1న ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్‌లో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న 45-59 వయసులోపు వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,710కి చేరింది. గడచిన 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, కృష్ణా జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి.
అత్పల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 911 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,244కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,09,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,048 మంది కోలుకున్నారు.