Ankita Bhandari Murder Case: రేప్ చేసి చంపేశారా, బీజేపీ నేత రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్ హత్య కేసులు షాకింగ్ విషయాలు, పార్టీ నుంచి వినోద్ ఆర్య సస్పెండ్, పుల్‌కిత్ ఆర్య అరెస్ట్
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్‌లో అదృశ్యమైన రిసెప్షనిస్ట్ (19) (Ankita Bhandari Murder Case) విగతజీవిగా పడిఉండటం సంచలనం రేపింది.
Dehradun, Sep 24: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్‌లో అదృశ్యమైన రిసెప్షనిస్ట్ (19) (Ankita Bhandari Murder Case) విగతజీవిగా పడిఉండటం సంచలనం రేపింది. ఈ కేసులో ఓ బీజేపీ నేత కుమారుడు అరెస్టవడంతో, నిందితునికి చెందిన ఓ రిసార్ట్‌ను ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కూల్చేసింది. నిందితుని సోదరుడిని, వారి తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
హరిద్వార్‌కు చెందిన వినోద్ ఆర్య గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ మాటీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు, నిందితుడు పుల్‌కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్య ఓబీసీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సస్పెన్షన్‌తో ఇప్పుడు పదవి పోయింది.యువతి హత్య కేసు దర్యాప్తు కోసం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పుల్‌కిత ఆర్య సహా ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యక్తిగత వివాదం నేపధ్యంలో రిసార్ట్ సమీపంలోని కాలువలోకి యువతిని తోసివేశామని దీంతో ఆమె మునిగిపోయారని (Ankita Bhandari Killing) పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. యువతి హత్య కేసు విచారణపై డీఐజీపీ రేణుక దేవి సారధ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామని సీఎం ధామి ట్వీట్ చేశారు.ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు. నిందితుడు అక్రమంగా నిర్మించిన రిసార్ట్‌ను శుక్రవారం రాత్రి బుల్డోజర్‌తో అధికారులు కూల్చివేశారని చెప్పారు. నీచమైన నేరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య ఆదివారం జరగ్గా.. కాలువలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ తనయుడి క్రూర చర్యతో స్థానికుల హత్య జరిగిన రిసార్టుకు నిప్పుపెట్టారు.దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మింది. రిషికేశ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని ఈ రిసార్టు ఉత్తరాఖండ్ సీనియర్ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందినది.
రిసార్టులో పనిచేసే యువతి సోమవారం నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పుల్కిత్ ఆర్య కూడా ఆమె సోమవారం నుంచి కనిపించడం లేదని చెప్పాడు. కానీ పోలీసుల తదుపరి విచారణలో రిసార్టు ఓనర్ పుల్కితే మరో ఇద్దరితో కలిసి ఆమెను హత్య చేసినట్లు తేలింది. దాంతో పోలీసులు శుక్రవారం హత్య కేసులో పుల్కిత్‌ను అరెస్ట్ చేసి, మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఉదయం రిసార్టు సమీపంలోని ఓ కాలువలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది.
పుల్‌కిత్‌తో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్‌భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. అయితే తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాతే హత్యకు గురైందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష‍్యాధారాలు ఉన్నట్లు చెప్పారు.