COVID-19 Outbreak in HYD: హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు? ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని వెల్లడించిన వైద్యాధికారులు, 104 హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తృత సాయం కోరుతున్నట్లు తెలిపారు. నగరప్రజలకు అందుబాటులో ఉంచేందుకు 50 వేల మాస్కులను తెప్పించనున్నారు. కరోనావైరస్ కోసం ప్రత్యేకంగా 104 హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ప్రారంభించారు.....

COVID-19 in India | PTI Image

Hyderabad, March 4: ఇటీవల కరోనావైరస్ (COVID 2019) బారిన పడి దుబాయి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ (Dubai- Bengaluru- Hyderabad) వచ్చిన 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ప్రస్తుతం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో (Gandhi Hospital) ఆరో అంతస్తులో గల ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఫిబ్రవరి 19 నుంచి అతడికి  వైరస్ నిర్ధారణ అయ్యే వరకు అతడితో కలిసిన కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అలాగే బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు అతడితో ప్రయాణం చేసిన తోటి ప్రయాణికులు, ఇతరులు కలిపి మొత్తంగా 88 మందికి గాంధీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 45 మందికి లక్షణాలు ఏమి కనిపించకపోవడంతో వీరిని ఇంటికి పంపించేసి గృహ నిర్భంధంలో ఉంచారు.

కాగా, మరో 36 మందికి వైరస్ లక్షణాలు కనిపించాయని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' జాతీయ మీడియా ఒక నివేదికలో వెల్లడించింది. ఈ 36 మందిలో యువకుడి కుటుంబ సభ్యులతో పాటు, ఇతడితో కలిసి ఏసీ బస్సులో ప్రయాణించిన వారు ఉన్నారని కరోనావైరస్ విభాగం రాష్ట్ర నోడల్ అధికారి విజయ్ కుమార్ వెల్లడించారు.

అయితే లక్షణాలు కనిపించినంత మాత్రానా వీరికి కరోనావైరస్ సోకిందని చెప్పడం లేదని, వీరు రిపోర్ట్స్ నెగెటివ్ గానే రావొచ్చని చెప్పారు. బుధవారం సాయంత్రం నాటికి వీరి రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, కరోనావైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కరోనావైరస్ పై అవగాహనా కార్యక్రమాలు, నిర్మూలించే దిశగా చర్యలు చేపడతారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఇప్పటికే తగిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

రాష్ట్ర వాతావరణానికి కరోనావైరస్ మనుగడ సాధించే అవకాశం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తృత సాయం కోరుతున్నట్లు తెలిపారు. నగరప్రజలకు అందుబాటులో ఉంచేందుకు 50 వేల మాస్కులను తెప్పించనున్నారు. కరోనావైరస్ కోసం ప్రత్యేకంగా 104 హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ప్రారంభించారు.