Anti-Air Pollution Curbs: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం, అన్ని ప్రాథమిక తరగతులను మూసివేసిన ఢిల్లీ ప్రభుత్వం, 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా ఆదేశాలు
దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం (Anti-Air Pollution Curbs) తీసుకుంది.
New Delhi, Nov 4: దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం (Anti-Air Pollution Curbs) తీసుకుంది. గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా(వర్క్ ఫ్రం హోమ్) ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఈ పద్దతినే అనుసరించాలని పేర్కొంది.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక తరగతులను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి పై విద్యార్థులు బహిరంగ ఆటలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది.ఢిల్లీలో శనివారం నుంచి ప్రాథమిక తరగతులు మూసివేస్తున్నాం. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఐదు నుంచి పై తరగతి విద్యార్థుల అవుట్‌డోర్ క్రీడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) తెలిపారు.
కేవలం అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్‌జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద వాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించింది. కమర్షియల్ డీజిల్ ట్రక్స్ వాహనాలు కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది.అంతేగాక రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే గతేడాది అవలంబించినటే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి యోచిస్తోంది.
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్‌ను దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం.. ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరగా.. ఏక్యూఐ 408గా నమోదైంది. ప్రస్తుతం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్‌లో 318గా నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్రమత్తమైంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ రష్ట్రాల సీఎస్‌లను నవంబర్ 10లోపు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు హాజరు కావాలని కోరింది.
పంజాబ్‌లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో జరుగుతున్న పంట వ్యర్ధాల కాల్చివేతపై నిందారోపణలు వద్దు అని కేజ్రీవాల్ తెలిపారు. వాయు కాలుష్యం అనేది నార్త్ ఇండియా సమస్య అని, వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని కేజ్రీ అన్నారు. ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి మేమే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాదిలోగా పంట వ్యర్ధాల కాల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని, వచ్చే ఏడాదికి ఇలాంటి కాలుష్యం లేకుండా చూస్తామని కేజ్రీ అన్నారు. తమ ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే వచ్చిందని, ఈ సమస్యను ఎదుర్కోవడంలో మాఫియాలు అడ్డువస్తున్నాయని, కానీ వచ్చే ఏడాదిలోగా దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు.
40 లక్షల ఎక్టార్లలో వరి పంట పండిస్తున్నారని, వచ్చే ఏడాది లోగా ఆ భూముల్లో పంట మార్పిడికి ప్రయత్నాలు చేస్తామని పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. ఢిల్లీ తరహాలోనే హర్యానా, యూపీలోని అనేక నగరాల్లో వాయు నాణ్యత క్షీణించినట్లు ఇద్దరు సీఎంలు వెల్లడించారు. పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నానరు. ఈ నేపథ్యంలోనే శనివారం నుంచి ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల్ని ఆశ్రయించేందుకు ఎంఎస్పీల గురించి హామీ ఇస్తున్నట్లు సీఎంలు తెలిపారు.
హర్యానా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో వరి దుబ్బుల కాల్చివేత సంఘటనలను సంవత్సరాలవారీగా పరిశీలించినపుడు, 2016లో 15,686; 2017లో 13,085; 2018లో 9,225; 2019లో 6,364; 2020లో 4,202; 2021లో 6,987 సంఘటనలు జరిగాయి. 2021 నవంబరు 3 వరకు 3,438 సంఘటనలు జరిగాయి. 2022 నవంబరు 3 వరకు 2,377 సంఘటనలు జరిగాయి. అంటే గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 30 శాతం తగ్గుదల కనిపించింది.
మరోవైపు రైతులకు కూడా వాయు కాలుష్యంపై అవగాహన పెరిగింది. కాబట్టి పంట దుబ్బులను కాల్చే సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. పంట దుబ్బులను తగులబెట్టడం మానేసినందుకు ప్రభుత్వం చెల్లించే నగదు ప్రోత్సాహకాలు, రాయితీలలో కొంత భాగాన్ని రైతులు ఈ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. వరి పంటను కోసిన తర్వాత ఆ గోతుల్లోనే గోధుమ విత్తనాలను నాటడానికి అవకాశం కల్పించే హ్యాపీ సీడర్స్, సూపర్ సీడర్స్ యంత్రాలను రైతులు ఉపయోగిస్తున్నారు.
పంట దుబ్బులను తగులబెట్టడం మానేసినవారికి ఎకరాకు రూ.1,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రైతులకు ఒక క్వింటాల్ బేల్‌కు రూ.50 చొప్పున ప్రోత్సాహకం చెల్లిస్తోంది. పంట వ్యర్థాల నిర్వహణ పరికరాలకు 50 శాతం రాయితీ ఇస్తోంది. కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌పై 80 శాతం రాయితీ ఇస్తోంది. అదేవిధంగా కర్ణాల్, పానిపట్‌లలోని ఇథనాల్ ప్లాంట్లకు బేళ్ళను ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.2,000 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. వరి పంటను కోసిన తర్వాత మిగిలే గడ్డి, దుబ్బులను గోశాలలకు ఇస్తే, రూ.1,500 ప్రోత్సాహకం లభిస్తుంది.
అయితే చిన్నకారు రైతులు మాత్రం ఇప్పటికీ వరి దుబ్బులను తగులబెట్టడం మినహా తమకు మరొక దారి లేదని చెప్తున్నారు. బేళ్ల తయారీకి అయ్యే ఖర్చును తాము భరించలేమని చెప్తున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)