
Hyd, Feb 24: తెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే తేదీతో పాటు, ముందుగా రెండు రోజులు కూడా మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో రేపటి నుండి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవని (Wine Shops to Closed in Telangana) ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.