Arvind Kejriwal Challenges PM Modi: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్, రేపు బీజేపీ ఆఫీస్ కు వస్తా మీ ఇష్టం వచ్చినవాళ్లను అరెస్ట్ చేసుకోండి
ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ (BJP) లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లొంగకపోవడంతో కక్ష్యసాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
New Delhi, May 18: ప్రధాని నరేంద్రమోదీపై, అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ (BJP) లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లొంగకపోవడంతో కక్ష్యసాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అయినా ఆప్ భయపడదని హెచ్చరించారు. ఈ మేరకు స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో తన పీఏ బిబవ్ కుమార్‌ను (Bibav kumar) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ముఖ్య నేతలందరినీ తీసుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నానని, అక్కడ మీకు కావాల్సిన వాళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చని కేజ్రీవాల్ సవాల్ చేశారు. బీజేపీ ఇప్పటికే మనీశ్ సిసోడియాను, సంజయ్ సింగ్‌ను జైల్లో పెట్టిందని, ఇప్పుడు నా పీఏను కూడా అరెస్ట్ చేసిందని ఆయన అన్నారు. రాఘవ్ చద్దా లండన్ నుంచి వస్తున్నాడని వాళ్లే చెబుతున్నారని, ఆయనను కూడా వీళ్లు జైల్లో పెడుతారని ఎద్దేవా చేశారు.
ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్‌ను, అతిషిని కూడా జైల్లో పెడుతామని వాళ్లే చెబుతున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు. కేంద్రం ఇలా మా వెంట పడుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. మేం ఏం తప్పు చేశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీ చేయలేని విధంగా ఢిల్లీలో నాణ్యమైన విద్యను అందించడమే మేం చేసిన తప్పు. నగర పౌరుల కోసం మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేసి మంచి వైద్యం, మందులు అందించడమే మేం చేసిన తప్పు. బీజేపీ అలా చేయలేదు. అందుకే మొహల్లా క్లినిక్‌లను బంద్ చేయాలని చూస్తోంది’ అని కేజ్రీవాల్ విమర్శించారు.