Arvind Kejriwal Eating Mangoes: బెయిల్ కోసం కేజ్రీవాల్ జైలులో మామిడిపండ్లు తింటున్నారు, ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ, కేసు విచారణ శుక్రవారానికి వాయిదా
టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.
New Delhi, April 18: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. మార్చి 21న అరెస్ట్ అయిన తరువాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు.
అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ సబబేనని తెలిపిన ధర్మాసనం
ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాను ఆకట్టుకునేందుకు ఈడీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని సరైన పిటిషన్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో కేజ్రీవాల్ డైట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
తన బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన షుగర్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.