Assembly Election Results 2022: 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ నష్టం, పంజాబ్ లో చేజేతులా పోగొట్టుకున్న అధికారం, ఉత్తరాఖండ్, గోవాలో అధికారానికి దూరం..
ఊరూరా తిరిగి పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. కానీ ఆ శ్రమ ఫలితాల్లో కన్పించలేదు. యూపీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఇక దేశంలో రాజకీయంగా కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. బీజేపీ పై ఉన్న వ్యతిరేకతను కాస్త కూడా కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోయింది. ఉత్తర్ ప్రదేశ్ లో కనీస ప్రభావం కాంగ్రెస్ చూపించలేకపోయింది.
ఉత్తర్ ప్రదేశ్ లో గత మూడేళ్లుగా ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఊరూరా తిరిగి పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. కానీ ఆ శ్రమ ఫలితాల్లో కన్పించలేదు. యూపీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదు. బీజేపీ అధికారంలో ఉన్నా కొద్దో గొప్ప ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. రాహుల్ గాంధీ విస్తృతంగా చేసిన పర్యటనలు కూడా ప్రభావం చూపలేకపోయాయి.
ఐదు రాష్ట్రాల్లో కేవలం గోవాలో తప్ప కాంగ్రెస్ ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. గోవాలో కూడా సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఊహించనది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణులను మరింత నిరాశపర్చనున్నాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టకపోవడం, సీనియర్లంతా తిరుగుబాటు జెండా ఎగురవేయడం వంటి కారణాలు ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
అధికారంలోకి వచ్చే వీలున్న పంజాబ్ ను కూడా చేజేతులా కాంగ్రెస్ నాశనం చేసుకుంది. అక్కడ ముఖ్యమంత్రిని మార్చడం, కాంగ్రెస్ నేతల్లో విభేదాలను సకాలంలో పరిష్కరించకపోవడం వంటి కారణాలతో పంజాబ్ ను కూడా కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే ఈ ఎన్నికల ఫలితాలని స్పష్టంగా చెప్పవచ్చు.