Ayodhya Case: అయోధ్య కేసులో విషయంలో అనవవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. తన సహచర మంత్రులకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడే బాధ్యత అందరిదీ అని ఉద్ఘాటన
అలాగే విజయోత్సవాలు, ఊరేగింపులు లేదా విగ్రహాల ధ్వంసాలు మరియు దేవతామూర్తుల ప్రతిమలను సోషల్ మీడియాలో అవమానించే విధంగా పోస్టులు పెట్టడంపై కూడా నిషేధం విధించారు....
New Delhi, November 7: దశబ్దాల కాలంగా వివాదాలు కొనసాగుతున్న అయోధ్య కేసు (Ayodhya Case) లో మరికొన్ని రోజుల్లోనే సుప్రీంకోర్టు (Supreme Court) అంతిమ తీర్పు వెలువడనుండటంతో, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నొక్కిచెప్పారు. అలాగే అయోధ్య విషయంలో తీర్పు ఎలా ఉండబోతున్నా, దానిపై ఎలాంటి అనవవసరపు వ్యాఖ్యలు చేయకూడదని తన సహచర మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (Ranjan Gogoi) నేతృత్వంలో సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసు విచారణను ఇప్పటికే పూర్తి చేసింది మరియు ఈ నవంబర్ 17 లోగా దీనిపై తుదితీర్పు వెలువడుతుంది.
ఈ నేపథ్యంలో మంత్రి మండలిని సమావేశ పరిచిన ప్రధాని మోదీ, దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల ఆరా తీశారు. ఇతరులను రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు నివారించి, దేశంలో శాంతి భద్రతలు మరియు మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు.
అయోధ్య వివాదంపై శాంతిని నెలకొల్పాల్సిన ఆవశ్యకతపై గత 10 రోజుల్లో ప్రధాని మాట్లాడటం ఇది రెండోసారి. అక్టోబర్ 27న 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అన్ని వర్గాల ప్రజలు ఎలా అంగీకరించాయో ఈ సందర్భంగా ఉదహరించారు.
అంతకుముందు మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా కొంత మంది హిందూ మరియు ముస్లిం సంఘాల నాయకులతో సమావేశం ఏర్పర్చారు. వారి నుంచి శాంతి, సామరస్యాలకు ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలిగించకుండా తమ వంతు ప్రయత్నం చేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. కోర్టు తీర్పును గౌరవించాలని కోరారు.
ఇదిలా ఉండగా, సుప్రీంకోర్ట్ తీర్పు నేపథ్యంలో అయోధ్య జిల్లాలో డిసెంబర్ 10 వరకు సిఆర్‌పిసి సెక్షన్ 144 అమలులో ఉంది. ఏ నలుగురు కూడా ఒకచోట గుమిగూడి ఉండటం చట్టరీత్యా నేరం. అలాగే విజయోత్సవాలు, ఊరేగింపులు లేదా విగ్రహాల ధ్వంసాలు మరియు దేవతామూర్తుల ప్రతిమలను సోషల్ మీడియాలో అవమానించే విధంగా పోస్టులు పెట్టడంపై కూడా నిషేధం విధించారు.