Supreme Court of India. File Image. (Photo Credits: ANI)

New Delhi, October 16:  సుదీర్ఘ కాలంగా 134 ఏళ్ల తరబడి కొనసాగుతున్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వివాదానికి సంబంధించిన కేసులో వాదనలు ముగిశాయి. అక్టోబర్ 16 సాయంత్రం 5 గంటల వరకే ఇరుపక్షాల వాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అంతకుముందే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించడం పూర్తి చేశారు. ఇక దీనిపై వెలువరించాల్సిన తుది తీర్పును సుప్రీం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా విచారించకుండా మిగిలిపోయిన అంశాలేమైనా ఉంటే కోర్టుకు సమర్పించాల్సిందిగా పిటిషనర్లకు మూడు రోజులు గడువు విధించింది.

ఈ కేసులో తుది తీర్పును నవంబర్ 17న సుప్రీంకోర్టు ప్రకటించనుంది. అదేరోజు ఈ కేసుపై తుది తీర్పు వెలువరించే చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గోగోయ్ పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో  ఈ తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

రాజకీయ పరంగా, మతపరంగా, చారిత్రాత్మక అంశాల పరంగా అతి సున్నితమైన ఈ కేసును సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6 నుంచి కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే.  గత 40 రోజులుగా రాజ్యంగ ధర్మాసనం ఎదుట కొనసాగుతున్న వాడీవేడీ వాదనలకు నేటితో తెరపడింది.

మరోవైపు ఈ కేసు విషయంలో ప్రసార మాధ్యమాలలో వచ్చే వార్తలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించారు. మీడియా సిబ్బందికి నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. తీర్పు ఎవరివైపు ఉన్నా సరే,  ఏ మతానికి సంబంధించిన వర్గాలకైనా భయాందోళనలు కలిగించేలా  ఈ కేసుకు సంబంధించి కోర్టు ప్రోసీడింగ్స్ కానీ, నిజనిర్ధారణపై న్యూస్ డిబేట్లు, మసీదు కూల్చివేత దృశ్యాలు, ఒకవర్గానికి సంబంధించిన సంబరాలు కానీ, అభిప్రాయాల ప్రసారం మొదలుగునవి ఎట్టి పరిస్థితుల్లో చూపించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేయబడ్డాయి.

Advisory Issued by NBSA:

రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం విషయంలో హిందూ వర్గాలు, ముస్లిం వర్గాల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. ఆ స్థలం మాది అని హిందూ వర్గాలు వాదిస్తున్నారు. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం దాన్ని ఆక్రమించాడని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదుని నిర్మించాడని చెబుతున్నారు. అయితే ముస్లీంలు మాత్రం ఆ స్థలం మాదేనని 1949 వరకూ మేము అక్కడ ప్రార్థనలు చేశామని అదే ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని చెబుతున్నారు. ఆ తర్వాతే హిందువులు పూజించటం ప్రారంభించారని చెబుతున్నారు. ఇలా నాలుగు దశాబ్దాల పాటు అక్కడ వివాదం నడుస్తూనే ఉంది. కోర్టు చుట్టూ ఈ కేసు తిరుగుతూనే ఉంది.

అయితే, 1992లో హిందువుల గ్రూపు మసీదును ధ్వంసం చేయటంతో ఈ వివాదం ఉద్ధృతమైంది. 1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (VHP)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రధర్శణలు నిర్వహించారు, ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో తర్వాత జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. దీంతో పాటుగా కొంతమంది హిందూ కార్యకర్తలు కూడా చనిపోయారు. దీంతో వివాదం మరింతగా ముదిరిపోయింది.  2010లో అలహాబాద్ హైకోర్టు  దీనిపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు భారతదేశంలో మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని పేర్కొన్నారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ధర్మాసనంలో ఉన్న ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.

దీంతో సంవత్సరాలు గడుస్తున్నా ఈ వివాదం అలాగే ఉండిపోయింది.

అక్టోబర్ 16, 2019తో ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి అయినట్లు సుప్రీంకోర్ట్ ప్రకటించింది. నవంబర్ 14, 2019న ఈ కేసు విషయంలో సుప్రీంకోర్ట్ వెలువరించే తీర్పు చారిత్రాత్మకం కాబోతుంది.