
భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి దీపావళి. పెద్దలు కూడా పిల్లలులాగా ఆనందించే ఈ పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి, హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగగా.. లక్ష్మీదేవి పూజతో పాటుగా సంపద, శ్రేయస్సు, సుఖశాంతి కోసం జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు.
తెలుగు పంచాంగం ప్రకారం, ఈ అమావాస్య అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21 సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా అమావాస్య రాత్రి సమయంలోనే దీపావళి వేడుక జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే అక్టోబర్ 20, సోమవారం రోజునే దీపావళి జరుపుకోవడం మంచిదని సూచన. దీపావళి అమావాస్య రోజు సాయంత్రం 7:08 నుండి 8:18 గంటల వరకు లక్ష్మీ పూజకు శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో పూజ చేస్తే ఆర్థిక, ఆధ్యాత్మిక, మరియు కుటుంబ శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం.
పండితుల సూచన ప్రకారం.. పూజకు ముందే ఇంటిని శుభ్రం చేసి, తులసికోట వద్ద దీపాలను వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారంలో స్వస్తిక గుర్తులు వేసి వాటిపై దీపాలను ఉంచడం లక్ష్మీ దేవిని ఆహ్వానించడం అని అర్థం.

దీపాల వెలుగులు చీకటిని తొలగించి సౌభాగ్యాన్ని సూచిస్తాయి. దీపాల తర్వాత పూజ, మంత్ర పఠనం, ఆరతులు, ప్రసాద పంపిణీ చేయడం పండుగలో ముఖ్యమైన భాగాలు.

ఐదురోజుల దీపావళి వేడుక: దీపావళి పండుగను ఐదు రోజులుగా జరుపుకుంటారు
అక్టోబర్ 18, శనివారం – ధంతేరాస్
అక్టోబర్ 19, ఆదివారం – ధన్వంతరి జయంతి
అక్టోబర్ 20, సోమవారం – నరక చతుర్దశి, దీపావళి (లక్ష్మీ పూజ)
అక్టోబర్ 21, మంగళవారం – గోవర్ధన్ పూజ, బలిపాడ్యమి
అక్టోబర్ 22, బుధవారం – భాయ్ దూజ్

ఈ విధంగా ఐదురోజుల పండుగను ఆనందంగా జరుపుకుని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.



గమనిక: పైన తెలిపిన వివరాలు పండితుల సలహాలు, వివిధ శాస్త్రాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. పూర్తిగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ కథనం ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.