
దీపావళి అనేది హిందూ ధర్మంలో వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందినది. దీన్ని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ప్రారంభమై, కార్తీక మాసం శుక్లపక్షం విదియ తేది వరకు ఐదు రోజులుగా జరుపుకుంటారు. ఈ ఐదు రోజులలో మూడవ రోజు అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే ఈ రోజు లక్ష్మీ పూజ జరుపుకుంటారు. దీపావళి రోజు ఇంట్లో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో సంపద, శ్రేయస్సు, సుఖశాంతి కోసం లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారు.
ఈ ఏడాది (2025), దీపావళి అక్టోబర్ 20న జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అమావాస్య తిథి రెండు రోజులు వచ్చింది: అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 గంటల నుండి అక్టోబర్ 21 సాయంత్రం 5:54 గంటల వరకు. దీపావళి రోజున వృషభ కాలము రాత్రి 7:08 గంటలకు ప్రారంభమై 9:03 గంటలకు ముగుస్తుంది. ముఖ్యమైన లక్ష్మీ పూజ శుభముహూర్తం రాత్రి 7:21 గంటల నుండి 8:19 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజ చేస్తే అధిక శ్రేయస్సు. సంపద లభిస్తుంది అని నమ్మకం.
మొదలుపెట్టేముందు పూజ స్థలాన్ని శుభ్రం చేసి, అన్ని అవసరమైన వస్తువులను సిద్దం చేసుకోవాలి. అడ్డంకులు తొలగించడానికి గణేశుడిని ఆరాధిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించి, నీరు, పువ్వులు, ధూపం, పండ్లు, స్వీట్లు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు.

దీపాల వెలుగులు చీకటిని తొలగించి శ్రేయస్సు తీసుకువస్తాయి. పూజలో మంత్రాల పఠనం, ఆరతులు పాడడం, వ్యక్తిగత ప్రార్థనలు ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి.

చివరగా ప్రసాదం పంపిణీ చేసి, కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి విందులు, వేడుకలు జరుపుకుంటారు.

లక్ష్మీ దేవి సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక. ఆమెను ఆరాధించడం ద్వారా వ్యక్తి ఆర్థిక, ఆధ్యాత్మిక, కుటుంబ సంబంధాల పరంగా శ్రేయస్సు పొందుతారు. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడం సంపద, విజయానికి దారితీస్తుంది అని నమ్మకం.

ఈ పూజ ద్వారా మంచి ఆరోగ్యం, ప్రగతి, మరియు సంతోషం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం. పండితుల సలహాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. పూజ కోసం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.