Weather Forecast: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది.
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఈ వాయుగుండం పయనిస్తుందని, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించింది. ఏపీలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక, నైరుతి రుతుపవనాలు నేటితో దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయని, నేటి నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైనట్టు ఐఎండీ అమరావతి తెలిపింది.
దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది.