Bharat Bandh on Dec 8: మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమయిన విపక్షాలు, డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు పూర్తి మద్ధతు, బీజేపీ పార్టీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ నయా వ్యూహం

డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్‌, టీఆర్ఎస్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి.

Bharat Bandh 2020 Protests | File Photo

New Delhi, Dec 7: ప్రధాని మోదీ సర్కారు కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు డిసెంబర్ 8న ప్రకటించిన ‘భారత్‌ బంద్‌’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్‌, టీఆర్ఎస్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి.

ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నటుడు కమల్‌హాసన్‌ పార్టీ ‘ఎంఎన్‌ఎం’ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సహా పలు బ్యాంక్‌ యూనియన్లు భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపాయి.

కేంద్రం సత్వరం రైతుల సమస్యకు పరిష్కారం చూపకపోతే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్‌ 9న పవార్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్‌ వెల్లడించారు. పవార్‌తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్‌ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి.

రైతుల ఉద్యమానికి సీఎం కేసీఆర్ మద్ధతు, డిసెంబర్ 8న భారత్ బంద్, టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని తెలంగాణ సీఎం పిలుపు

దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చారు. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్‌ సహా పలు యూరోప్‌ దేశాల్లో పంజాబ్‌ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు.

రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని భారత్‌ బంద్‌ను కేసీఆర్‌ సమర్థించారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని కేసీఆర్‌ గుర్తుచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ బంద్‌ విజయవంతానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కృషి చేస్తుందని, బంద్‌కు సంఘీభావం తెలిపి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే, ఫలితం తేలని ఐదో విడత చర్చలు, డిసెంబర్ 9న మరోసారి చర్చలు, 8వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో హైదరాబాద్‌లో భారీ సదస్సును నిర్వహిస్తామని గత నెలలో కేసీఆర్‌ ప్రకటించారు. రైతు సమస్యలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల ఫలితాన్ని చూసిన తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్, అఖిలేశ్‌ యాదవ్, స్టాలిన్‌ వంటి నేతలతో కేసీఆర్‌ ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు.