Hyderabad, Dec 6: దేశ వ్యాప్తంగా ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు (CM KCR Supports Bharat Bandh) ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు (Bharat Bandh) ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను (three Agriculture Acts) టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్కదానిలోనూ పంటలకు కనీస మద్దతు ధరపై హామీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే పార్లమెంటులో తాము వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని, ఎప్పటికీ తాము ఆ బిల్లులకు వ్యతిరేకమేనని కవిత చెప్పారు.
కొత్త చట్టాలు మండీల సంస్కృతిని ధ్వంసం చేసేలా ఉన్నాయని, మండీలు కనుమరుగైతే దేశంలో వాటికి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకే రైతులు అభద్రతా భావంతో బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 8న రైతులు నిర్వహించతలపెట్టిన భారత్ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.