Bird Flu Scare: ముంచుకొస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ ముప్పు, నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్, నాన్ వెజ్ అమ్మకాలు, ఎగుమతులపై హిమాచల్ ప్రదేశ్‌లో నిషేధం, ఇన్‌ఫెక్షన్‌తో వేల సంఖ్యలో పక్షులు మృతి
వలస పక్షుల వరుస మరణాలతో (Migratory Birds Dead) రాజస్థాన్, మధ్యప్రదేశ్,కేరళ, హిమాచల ప్రదేశ్ (Himachal Pradesh) వంటి నాలుగు రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వలసపక్షులు 'బర్డ్ ఫ్లూ' కారణంగా మరణించినట్టు ల్యాబ్ రిపోర్టులు రావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
Shimla, January 5: దేశంలో కరోనావైరస్ ముప్పు తగ్గుముఖం పడుతున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో 'బర్డ్ ఫ్లూ' భయాలు (Bird Flu Scare) మొదలయ్యాయి. వలస పక్షుల వరుస మరణాలతో (Migratory Birds Dead) రాజస్థాన్, మధ్యప్రదేశ్,కేరళ, హిమాచల ప్రదేశ్ (Himachal Pradesh) వంటి నాలుగు రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వలసపక్షులు 'బర్డ్ ఫ్లూ' కారణంగా మరణించినట్టు ల్యాబ్ రిపోర్టులు రావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని పాంగ్ డ్యామ్ సరస్సుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో బార్‌హెడ్ బాతులతో పాటు పాటు వివిధ రకాల వలస పక్షులు పెద్ద ఎత్తున మృత్యువాతపడ్డాయి.అలప్పుజ జిల్లాలోని నాలుగు పంచాయితీలు, కొట్టాయం జిల్లా నీందూర్‌లోని డక్ ఫామ్‌లో 'బర్ల్ ఫ్లూ' రిపోర్టులు వచ్చాయి. డక్ ఫామ్‌లో సుమారు 1.700 బాతులు వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో మృతి చెందాయి.
కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 'బర్డ్ ఫ్లూ' చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు పరిధిలోని బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపివేయాలని అధికారులు నిర్ణయించారు. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో జరిపిన పరీక్షల్లో 'బర్ల్ ఫ్లూ' వ్యాధి చెలరేగినట్టు నిర్ధారణ అయింది.
హెచ్5ఎన్8 వైరస్ వ్యాప్తి చెందకుండా 40,000 పక్షులను చంపివేయాలని, ఒక్క కుట్టాండ్ రీజియన్‌లో 34,000 పక్షలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కల్లింగ్ ఆపరేషన్ చేపట్టడానికి జిల్లా అధికారులు మంగళవారంనాడు ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దించారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో పాంగ్ సరస్సులో గత వారం రోజుల్లో వివిధ జాతులకు చెందిన 2,400కు పైగా పక్షులు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫౌల్ట్రీల్లో కొనుగోలు, అమ్మకాలపై నిషేధం విధించారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులను గుర్తించిన విషయం తెలిసిందే. వలస పక్షుల మృతి నేపథ్యంలో కాంగ్రా కలెక్టర్ రాకేశ్‌కుమార్ ప్రజాపతి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జలాశయానికి చుట్టూ కిలోమీటర్ పరిధిలో మానవులు, పశువులను అనుమతించవద్దని ఆదేశాలు ఇచ్చారు.
ఇక భోపాల్ నుంచి వచ్చిన రిపోర్టులో మృతి చెందిన అన్ని పక్షులలోనూ హెచ్5ఎన్1 ఎవియన్ ఇన్ఫ్లుయంజా వైరస్ ఉందని స్పష్టమైంది. మరోవైపు, రాజస్థాన్‌లోనూ బర్డ్ ఫ్లూ అలర్ట్ ప్రకటించారు. జలావర్ జిల్లా, జైపూర్ సహా పలు సిటీల్లో బర్డ్ ఫ్లూతో కాకులు పెద్దఎత్తున మృతి చెందాయి. దీంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో సంఘటనను పర్యవేక్షించేందుకు తొమ్మిది కిలోమీటర్ల వ్యాసార్థంతో నిఘాజోన్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఫతేపూర్, డెహ్రా, జవాలి, ఇండోరాలో ఏదైనా పౌల్ట్రీ, పక్షులు, ఏదైనా జాతికి చెందిన చేపలు, గుడ్లు, మాంసం, కోళ్లు మొదలైన వాటితో సహా వధ, అమ్మకం, కొనుగోలు, ఎగుమతులపై నిషేధం విధించారు. విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్ 34 ప్రకారం కలెక్టర్ తన విచక్షణాధికారాలను వినియోగిస్తూ ఆయా దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్-1 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ పక్షులకు వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. అలాగే ఇది మనుషులకు కూడా సోకుతుంది. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా హెచ్5ఎన్ కేసులను కేరళలో అలప్పుజ, కొట్టాయంలో గుర్తించారు. అలాగే రాజస్థాన్‌లోనూ వందల సంఖ్యలో కాక్కులు చనిపోయాయి. మధ్యప్రదేశ్‌లోనూ బర్డ్‌ఫ్లూ వైర్‌ను గుర్తించారు.