Black Fungus: బ్లాక్ ఫంగస్‌ని తక్కువ అంచనా వేయవద్దు, కేసులు ఎక్కువవుతున్నాయి, ఆందోళన వ్యక్తం చేసిన ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ తప్పక ధరించాలని సూచన
కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారికి ఈ ఫంగస్ (black fungus) సోకుతుండటం ప్రస్తుత సెకండ్ వేవ్‌లోనే కనిపిస్తోందన్నారు.
New Delhi, May 16: దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్ అనే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు (black fungus infection) ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా (AIIMS Director Randeep Guleria) ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారికి ఈ ఫంగస్ (black fungus) సోకుతుండటం ప్రస్తుత సెకండ్ వేవ్‌లోనే కనిపిస్తోందన్నారు.
మ్యుకోర్‌మైకోసిన్(బ్లాక్ ఫంగస్) బారినపడే వారిలో 90 శాతం మంది డయాబెటిస్ బాధితులే ఉంటున్నారన్నారు. వీరి రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలిస్తూ నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించారు. శనివారం జరిగిన క్లినికల్ ఎక్స్‌లెన్స్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో ఈ మేరకు రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులను డాక్టర్ గులేరియా అప్రమత్తం చేశారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన వ్యాధుల నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) ప్రకటించిన మరుసటి రోజే.. ప్రజలను గులేరియా, రాఘవన్ అప్రమత్తం చేశారు. ‘మరింత డాటా వచ్చేవరకైనా మనం జాగ్రత్తగా ఉండాలి. కరోనా వైరస్ చాలా తెలివైనది. మ్యుటేషన్లతో రూపం మార్చుకుంటున్నది. కొత్త వేరియంట్ల నుంచి వ్యాక్సిన్లు కల్పించే రక్షణ ఏమిటనేది చెప్పలేం. కాబట్టి నిబంధనలను కొనసాగించాల’ని గులేరియా తెలిపారు.
డయాబెటిస్ పేషెంట్లు, స్టెరాయిడ్లు తీసుకునే వారే ఎక్కువగా మ్యుకోర్‌మైకోసిన్ బారిన పడుతున్నట్లు ప్రస్తుతం పెరుగుతున్న కేసులను బట్టి తెలుస్తోందని గులేరియా తెలిపారు. స్టెరాయిడ్ల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి దారి తీస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 500కు పైగా మ్యుకోర్‌మైకోసిన్ కేసులను గుర్తించినట్లు అక్కడి వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు.
కోవిడ్ పేషెంట్ల చికిత్సలో వాడుతున్న టోసిలిజుమాబ్ అనే ఔషధం ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందా అనే విషయాన్ని గుజరాత్ వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపారు. కోవిడ్‌బారిన పడిన తర్వాత కూడా డయాబెటిస్ పేషెంట్లు తమకు సూచించిన మందులు వాడకం కొనసాగించాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ శనివారం తెలిపారు.