'Can't Pay Rs 4 Lakhs Ex Gratia': కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించలేం, ఒక వేళ అలా చెల్లిస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుంది, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్టపరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని ఓ అఫిడవిట్ ద్వారా తెలిపింది.
New Delhi, June 20: కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించలేమని (Can't pay Rs 4 lakhs ex gratia) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్టపరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని ఓ అఫిడవిట్ ద్వారా తెలిపింది. మే 24న సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుపై స్పందిస్తూ (Centre to SC) ఈ అఫిడవిట్‌ను సమర్పించింది. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్ 12 దృష్ట్యా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేఖ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ కోరారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఆర్థిక పరిమితులతోపాటు ఇతర కారణాల వల్ల (Financial Constraints) నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటికే అవసరార్థులకు అనేక రకాలుగా చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపింది. అవసరంలో ఉన్నవారికి అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరంలో ఉన్నవారికి భారీ మొత్తాన్ని చెల్లించినట్లు పేర్కొంది. ప్రభుత్వాల నిధులు విపరీతంగా ఖర్చయినట్లు వివరించింది.
పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన వివరాల ప్రకారం, భారత దేశంలో కోవిడ్-19 వ్యాప్తి జరుగుతున్న తీరు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్ర విపత్తు స్పందన నిధి క్రింద సహాయాన్ని అందజేసేందుకు, ఈ వ్యాధిని నోటిఫైడ్ డిజాస్టర్‌గా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి, జాతీయ విపత్తు స్పందన నిధిల నుంచి సహాయం అందజేయడానికి కొన్ని సవరణలను జారీ చేసింది. మరణించిన వ్యక్తులకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ లేఖను పంపించింది.
దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులన్నీ వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా చేస్తే కరోనా వైరస్ విజృంభణ సమయంలో అత్యవసర వైద్య సేవలు, పరికరాలను సమకూర్చుకోవడం, లేదా తుపానులు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వద్ద సరిపడా నిధులు ఉండవు’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అందుకే కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పిటిషనర్ చేసిన విన్నపం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థోమతకు మించినదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒకవేళ కరోనాకు పరిహారం చెల్లిస్తే, ఇతర వ్యాధులకు నిరాకరించడం అన్యాయమే అవుతుందని అభిప్రాయపడింది. కేవలం వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరిత్యాలకు మాత్రమే విపత్తు సహాయం వర్తిస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ కరోనా మరణాల సంఖ్య కొనసాగుతూనే ఉంది. నిత్యం 1500లకు పైగా కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారిసంఖ్య 3లక్షల 86వేలు దాటింది.