Can’t Regulate Political Alliances: దేశంలో రాజకీయ పొత్తులను నియంత్రించే చట్టపరమైన అధికారం మాకు లేదు, కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషన్

విపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈసీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది

Election Commission of India. (Photo Credit: Twitter)

ECI on Political Alliances: దేశంలో రాజకీయ పొత్తులను నియంత్రించడానికి తమకు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఎన్నికల కమిషన్‌ (Election Commission) వెల్లడించింది. విపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈసీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘ఇండియా (INDIA)’ చట్టబద్ధతపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేసింది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో 26 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి.అయితే కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు దేశం పేరును ఉపయోగించుకుంటున్నాయని పిటిషనర్‌ ఆరోపించారు. ఇండియా పేరును వినియోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోర్టును కోరారు.

రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు, ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తన స్పందన తెలియజేసింది. ‘ఎన్నికలను నిర్వహించే, రాజకీయ పార్టీలను రిజిస్టర్‌ చేసుకునే అధికారం మాత్రమే ఈసీకి ఉంది. రాజకీయ పొత్తులను ప్రజాప్రాతినిధ్య చట్టం కింద నియంత్రించలేం. రాజకీయ కూటములను చట్టపరమైన సంస్థలుగా పరిగణించలేం. కాబట్టి వాటి పనితీరును నియంత్రించేందుకు చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదు’ ఈసీ పేర్కొంది.