CBI Books Hyd Firm for Bank Fraud: టీడీపీ మాజీ ఎంపీ ఇంటిపై సీబీఐ దాడులు, రూ.7,926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేసిన కెనరా బ్యాంకు
శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు.
New Delhi, December 18: టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు చేశాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు (CBI Books Hyd Firm for Bank Fraud) చేపట్టాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు.
ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, పన్నుల ఎగవేతకు సంబంధించిన నోటీసులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తొమ్మిది మంది అధికార బృందం ఈ సోదాల్లో పాల్గొనగా అందులో ఐదుగురు సీబీఐ అధికారులు కాగా, నలుగురు కెనరా బ్యాంకు అధికారులున్నట్లు తెలిసింది. కాగా రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ రూ.7,926.01 కోట్లు మోసానికి (Rs 7,926-Crore Bank Fraud) సంబంధించి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
అసలు కథ ఎక్కడ మొదలైంది ?
తాము కొత్తగా చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు రుణాలు కావాలని హైదరాబాద్ బేస్‌డ్ ట్రాన్స్‌టాయ్ కంపెనీ పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీనికి కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం.. వీరి నుంచి తీసుకున్న నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాలెన్స్ షీట్లు, మోసపూరిత స్టేట్‌మెంట్లు, తప్పుడు లెక్కల పుస్తకాలు, పత్రాలు చూపించి బ్యాంకు నిధులను తప్పుడు మార్గంలో మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7,926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది.
దీంతో పాటు వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లను పలు దఫాల్లో వేరే ఖాతాలకు ట్రాన్స్‌టాయ్ మళ్లించిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారంటూ హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ 2019 డిసెంబరు 30న కేసు నమోదు చేసింది. అందులో చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ఇదే కంపెనీకి చెందిన ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, గుర్తుతెలియని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగులనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
ఈ కేసుతో సంబంధమున్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి (Transstroy Ltd) చెందిన కార్యాలయాలు, పలువురు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్‌ను సీబీఐ పేర్కొంది. ట్రాన్స్‌ట్రాయ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasiva Rao), అడిషనల్ డైరెక్టర్ అక్కినేని సతీష్, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులను కూడా సీబీఐ నిందితులుగా చూపించింది.