Varanasi, December 19: సెకండ్ హ్యండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు సాగించే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ ఓఎల్ఎక్స్ లోప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి (Mini PMO on Sale) పెట్టారు. ఈ ఘటన వైరల్ కావడంతో ఉలిక్కిపడిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని (PM Narendra Modi's Varanasi Office) రూ.7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు.
ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్‌కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా (Mini PMO) తెలిపారు. వారణాసి కార్యాలయాన్ని రూ .7.5 కోట్ల ధరకు అమ్మకానికి పెట్టారు.
పోలీసులకు ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టడం పై ఫిర్యాదు అందడంతో వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆన్లైన్ ప్రకటనల వెబ్‌సైట్ ప్రకటన చూసిన పోలీసులు ఖంగు తిన్నారు. వెంటనే ఆ యాడ్‌ను తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
అరెస్టయినవారు భేలుపూర్‌లోని జవహర్ నగర్ కాలనీలోని ప్రధానమంత్రి కార్యాలయం యొక్క ఛాయాచిత్రాలను క్లిక్ చేసి, ఆ ప్రకటనను ఓఎల్ఎక్స్ లో పోస్ట్ చేసినట్లు వారణాసి ఎస్‌ఎస్‌పి అమిత్ కుమార్ పథక్ తెలియజేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వారణాసి నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాబడిన ప్రధాని నరేంద్ర మోడీకి భేలూపూర్ లోని జవహర్ నగర్ కాలనీలో పార్లమెంటరీ కార్యాలయం ఉంది. దీనిని ఆగస్టు 2014 లో హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
గతంలో కూడా కొందరు అగంతకులు భారతదేశ యుద్ధ విమానాన్ని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టటం హాట్ టాపిక్ అయింది. అలీగఢ్ ముస్లింవర్సిటీలో ప్రదర్శనకు ఉన్న మిగ్- 23 యుద్ధ విమానాన్ని అమ్ముతామని ఓఎల్ఎక్స్ లో పెట్టేశారు. దాని ధర 9.99 కోట్ల రూపాయలని అందులో పేర్కొన్నారు.