New Delhi, Dec 18: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే అనేక దేశాల్లో మొదటి దశను దాటుకుని రెండవ దశలోకి కరోనా ప్రవేశించింది. ఇంకొన్ని దేశాల్లో ఏకంగా మూడవ దశలోకి వెళ్లింది. మన ఇండియా విషయానికి వస్తే సెకండ్ వేవ్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాపై ప్రపంచ యుద్ధం (Covid-19 is world war) జరుగుతుందని, దీని వల్ల ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నారని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.
కరోనా కట్టడిపై సరైన మార్గదర్శకాలు (guidelines) అమలు చేయకపోవడం వల్లే ఈ వైరస్ దావానంలా వ్యాపిస్తోందని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై (implementation of guidelines) దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ కట్టడికి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కఠిన నిబంధనలు అమలుచేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎక్కువ జనసంచారం ఉన్న ఫుడ్ కోర్టులు, తినుబండారాలు, కూరగాయల మార్కెట్లు, బస్ స్టేషన్లు , రైల్వే స్టేషన్లలో పోలీసు సిబ్బందిని మోహరించాలని సంబంధిత అధికారులను అత్యున్నత న్యాయస్థానం కోరింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో విధించే ఫీజులపై పరిమితి విధించే రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ (Lockdown) విధించాలనుకుంటే కొన్ని రోజులు మందుగానే ప్రకటన చేయాలని సూచించింది. దీంతో ప్రజలు ఇబ్బందికి గురికాకుండా ముందుగానే అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉంటారని తెలిపింది. అధికారులందరూ తప్పనిసరిగా మార్గదర్శకాలకు కట్టుబడి ఆంక్షలు అమలు చేసేలా చూడాలని పేర్కొంది.
గత ఎనిమిది నెలలుగా కరోనా కట్టడికి వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేయడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సుప్రీం పేర్కొంది. వారితో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు సైతం తగినంత విశ్రాంతిని కల్పించాల్సిన అవసరం ఉందని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది