New Delhi, Dec 18: కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళన (Farmers' Protest) నాలుగో వారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కేంద్రం ఓ మెట్టు దిగింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Agriculture Minister Narendra Singh Tomar) గురువారం ఎనిమిది పేజీల లేఖ రాశారు.
మూడు కేంద్ర చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఒక వర్గం కనీస మద్దతు ధరకు (MSP Will Continue) కేంద్రం చట్టబద్ధ హామీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తదనుగుణంగా ఎంఎస్‌ఎపీ గ్యారంటీనిస్తూ రాత పూర్వక హామీ ఇవ్వనున్నట్లు నరేంద్ర సింగ్ తోమర్ ఆ లేఖలో తెలిపారు. దీని ప్రకారం ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పంటలు కొనుగోలు చేసిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా, రెండింటిని విధిస్తారన్నారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తానూ రైతు కుటుంబానికి చెందిన వాడినేనని, చిన్నప్పటి నుంచి రైతు ఎదుర్కొన్న కష్టాలు తనకు తెలుసునని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాల అమలుతో రైతులు సంతృప్తి చెందుతారని, కనీస మద్దతు ధరపై పంటల సేకరణ నూతన రికార్డు కానున్నదని పేర్కొన్నారు. విపక్షాల పేరెత్తకుండానే ఎంఎస్పీ, వ్యవసాయ మార్కెట్లపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రైతుల ఉద్యమంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును హరించకూడదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది.
అయితే దీనిని కేంద్రం వ్యతిరేకించింది. అమలు ఆపేస్తే రైతులు మరింత భీష్మిస్తారని, వారికి సుప్రీం మద్దతు దొరికినట్లవుతుందని, చర్చలకు రావడానికి మరింత మొండికేసి తమ డిమాండ్లపైనే పట్టుబట్టి కూర్చుంటారని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విన్నవించారు. దీనిపై అత్యున్నత ధర్మాసనం స్పందిస్తూ.. ‘మేం చెబుతున్నది చట్టాలపై స్టే కాదు... చర్చల నిమిత్తం కొద్ది రోజులపాటు అమలు నిలిపివేత... ఇది సాధ్యమే... ప్రభుత్వంతో మాట్లాడి చూడండి... దీనిపై మేం శుక్రవారం ఆదేశాలిస్తాం..’ అని చీఫ్ జస్టిస్ శరద్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు సూచించింది.
‘రైతుల దుస్థితిని చూస్తే మాకు ఆందోళన కలుగుతోంది. పరిస్థితులు సాగుతున్న తీరుపై మేమూ బాధపడుతున్నాం. మేమూ భారతీయులమే’ అని పేర్కొంది. భారతీయ కిసాన్ యూనియన్ తప్ప మరే రైతు సంఘామూ సుప్రీంకోర్టు తలుపు తట్టకపోవడంతో గురువారం ఉన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పునూ ప్రకటించలేకపోయింది. ఇతర రైతు సంఘాల అభిప్రాయాలతో భారతీయ కిసాన్ యూనియన్ ఏకీభవించడంలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులందరికీ ఈ విషయంపై నోటీసులు జారీ చేయాలని సుప్రీం బెంచ్ నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలు సరైనవా కాదా, వాటి చట్టబద్ధత ఎంత... అన్న విషయం తాము తేల్చబోవడం లేదని, ముందుగా రైతుల నిరసన గురించి తేల్చాల్సి ఉన్నదని కోర్టు అభిప్రాయపడింది. రైతులకు నిరసన తెలపడం చట్టబద్ధమైన హక్కేననీ, ఆ హక్కును తాము అడ్డుకోవడం లేదని, అదే సమయంలో నిరసన ప్రదర్శనలు సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదనీ, వారి జీవనానికి ఆటంకం కలగరాదని జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు.
శనివారంనుంచి సుప్రీంకు శీతాకాల సెలవులు ప్రారంభమైనందువల్ల రైతు సంఘాలు తమ వెకేషన్ బెంచ్ తలుపు తట్టవచ్చని ఆయన చెప్పారు. కమిటీ విషయాన్ని ఆయన మళ్లీ ప్రస్తావించారు. ‘నిష్పక్షపాతమైన, స్వతంత్రమైన కమిటీ ఏర్పాటు చేయాలన్నది మా ఆలోచన. అందులో రైతు సంఘాల నేతలతో పాటు స్వతంత్రంగా, అన్ని ప్రాంతాల రైతుల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుని సూచనలిచ్చే నిపుణులు కూడా ఉండాలి. పి సాయినాథ్ లాంటి వ్యవసాయ రంగంపై అవగాహన ఉన్న నిపుణులు ఉండవవచ్చు. దీనిపై చర్చించి పేర్లివ్వండి’ అని జస్టిస్ బోబ్డే ఏజీని కోరారు. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య కొందరు ప్రముఖులు జోక్యం చేసుకుని- చర్చలకు వీలు కల్పించాలన్న ప్రతిపాదనపై తమకు అభ్యంతరం లేదని పంజాబ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా వచ్చిన సీనియర్ న్యాయవాది పి.చిదంబరం అన్నారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. టిక్రీ బోర్డర్‌లో పంజాబ్‌కు చెందిన 38ఏళ్ల రైతు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతును భటిండా జిల్లాకు చెంది న జై సింగ్‌గా గుర్తించారు. జై సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం పలువురు సహచర మంత్రులతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్‌లతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.బీజేపీ శ్రేణులు ఎంతవరకు రైతాంగాన్ని చేరగలిగారనే అంశంపై సమీక్షించినట్టు తెలుస్తోంది.
సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. ‘ఈ చట్టాలు బ్రిటీష్ పాలనను తలపిస్తున్నాయి. వారి కంటే ఘోరంగా మారొద్దని కేంద్రాన్ని కోరుతున్నా. మనకి అన్నం పెట్టే రైతు 2 డిగ్రీల చలిలో రోడ్డుపై పడుకుని నిరసన కొనసాగిస్తున్నాడు. చూస్తే బాధ కలుగుతోంది. ప్రతీ రైతూ ఇపుడో భగత్‌సింగ్‌లా మారాడు. ఎవర్నీ సంప్రదించకుండా చట్టాలు చేయడమెందుకు?’’ అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఆగ్రహంతో ఆ చట్టాల కాపీలను చించేశారు.