Punjab, December 17: ఢిల్లీ సరిహద్దుల్లో గత 22 రోజుల నుంచి కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఉద్యమిస్తున్న (Farmers' Protest) సంగతి విదితమే. ఎముకలు కొరికే చలిలో కుటుంబాలకు కుటుంబాలే (Ongoing Protests in Delhi) అక్కడ ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్ధతుగా మత ప్రబోధకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో రైతన్న గుండె ఆగిపోయింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని టిక్రీలో ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్ కు చెందిన రైతు గుండెపోటుతో (Farmer From Punjab Dies Due to Cardiac Arrest) మరణించాడు. గత 20 రోజుల నుంచి టిక్రీ సరిహద్దులో ఉన్న ఆ రైతు గురువారం విగతజీవిగా కనిపించాడు, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన రైతుకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ.. సిక్కు మత ప్రబోధకుడు గన్ తో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు (Singhu Border) వద్ద తుపాకీతో కాల్చుకున్నారు.
హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (HSGMC) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుంచి సగటున రోజుకో అన్నదాత ప్రాణం కోల్పోయారని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. కొందరు చలితో మరణించగా మరికొందరు ఉద్యమం నుంచి స్వరాష్ట్రాలకు తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలిపారు. ప్రాణాలర్పించిన రైతుల కోసం ఈ నెల 20 శ్రద్ధాంజలి దినంగా పాటిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.