Family Pension for Women’s Children: భర్తకు బదులు పిల్లలను నామినేట్ చేయొచ్చు.. పెన్షన్ నిబంధనలను సడలిస్తూ మహిళలకు వెసులుబాటునిచ్చిన కేంద్రప్రభుత్వం
మహిళా ఉద్యోగులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
Newdelhi, Jan 30: ఫ్యామిలీ పెన్షన్ (Family Pension) కు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు (women employees) కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు అమలైన నిబంధనల ప్రకారం.. ప్రభుత్వోద్యోగి లేదా పింఛనుదారు మరణిస్తే, ఆ వ్యక్తి యొక్క భార్య లేదా భర్తకు కుటుంబ పింఛనును మంజూరు చేసేవారు. ఆ విధంగా పింఛనును పొందిన వ్యక్తి కూడా మరణించిన తర్వాత లేదా అనర్హుడైన అనంతరం మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు దానిని పొందే అర్హత లభించేది. అయితే, తాజాగా కేంద్రం ఈ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది.
పెన్షన్ రూల్స్, 2021కు సవరణలు
దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021కు సవరణలు జరిగాయని చెప్పారు. మహిళా ప్రభుత్వోద్యోగి మరణిస్తే, ఆమె భర్తకు కాకుండా, అర్హత గల ఆమె బిడ్డ లేదా పిల్లలకు కుటుంబ పింఛనును మంజూరు చేయడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు.