Samvidhaan Hatya Diwas: ఎమ‌ర్జెన్సీపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేంద్రం, ఎమ‌ర్జెన్సీ విధించిన రోజును సంవిధాన్ హ‌త్యా దివ‌స్ గా ప్ర‌క‌ట‌న‌

జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది.

Amit Shah (Photo-ANI)

New Delhi, July 12: 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ (Samvidhaan Hatya Diwas) విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు. జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఎమర్జెన్సీ (Emergency) చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్‌ హత్యా దివస్‌ను పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ (Modi) సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం పట్ల ప్రేమ ఒలకబోస్తోందని పలు సందర్భాల్లో కాషాయ నేతలు కాంగ్రెస్‌పై భగ్గుమన్నారు.

 

రాజ్యాంగానికి పలుమార్లు సవరణలు తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని, అలాంటి పార్టీ తాము రాజ్యాంగాన్ని మార్చేస్తామని అసత్యాలు ప్రచారం చేస్తోందని గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ ప్రతులతో హడావిడి చేస్తోందని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.